Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విదేశాలకు వెళ్తున్నట్లయితే.. ఎన్నారై సెల్‌లో సంప్రదించండి..!!

విదేశాలకు వెళ్తున్నట్లయితే.. ఎన్నారై సెల్‌లో సంప్రదించండి..!!
FILE
పొట్ట చేత పట్టుకుని ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ విదేశాలకు పయనమయ్యే వారు.. ఎలా వెళ్లాలో, ఏం చేయాలో తెలియక ఏజెంట్లను ఆశ్రయించి మోసపోతున్న సంగతి తెలిసిందే..! ఇలాంటి వారికి తగిన సహాయ సహకారాలను అందించేందుకు.. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్‌లో ఎన్నారై సెల్ (ప్రవాసాంధ్రుల సంక్షేమ విభాగం)ను ఏర్పాటు చేశారు.

జూన్ 24వ తేదీన ప్రారంభమైన ఈ ఎన్నారై సెల్‌లో ఓ డిప్యూటీ తహశిల్దార్, సెల్ ఆఫీసర్, ఇద్దరు ఏఎస్సైలు విధులు నిర్వర్తిస్తూ.. తగిన సలహాలు, సూచనలు అందజేస్తున్నారు. అలాగే దుబాయి, మస్కట్ లాంటి దేశాలలో ఉపాధి కోల్పోయి జిల్లాకు చేరుకున్న వారి అర్హతలను బట్టి స్థానికంగా ఉపాధి అవకాశాలను సైతం కల్పిస్తున్నారు.

సాధారణ పరిపాలన (ఎన్నారై) శాఖ ఆధీనంలో పనిచేస్తున్న ఈ ఎన్నారై సెల్ డిప్యూటీ తహశిల్దార్.. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే జిల్లా యువతీ యువకులకు తగిన సలహాలు, సూచనలను అందజేస్తున్నారు. కాబట్టి.. విదేశీ ఉద్యోగాల మోజులో అనధికారిక రిక్రూటింగ్ ఏజెన్సీలను ఆశ్రయించి మోసపోవద్దు.

అలాగే సరైన ధ్రువపత్రాలు లేకుండా విదేశాలకు వెళ్లినట్లయితే.. ఆయా వ్యక్తులు, వారు సంపాదించిన కష్టార్జితాన్ని కోల్పోయి, జైలుపాలయ్యే అవకాశం ఉంటుంది. ఇక మహిళలయితే లైంగిక దోపిడీకి కూడా గురయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది. సరైన శిక్షణ లేకపోవడంవల్ల నిరక్షరాస్యులు, ఇళ్లలో పనిచేసే మహిళలు, యజమానుల చేతిలో హింసలకు కూడా గురికావచ్చు.

పైన చెప్పిన అంశాలన్నింటినీ గుర్తు పెట్టుకుని విదేశాలకు వెళ్లటం మంచిది. విదేశాలకు వెళ్లే క్రమంలో ఆయా వ్యక్తులు వారి పాస్‌పోర్ట్, వీసాలకు సంబంధించిన అనుమానాలను ఎన్నారై సెల్‌లో ధ్రువీకరించుకోవటం ఉత్తమం. కంపెనీ వీసాలు లేకుండా విదేశాలకు వెళ్లవద్దు. అలాగే, అలా వెళ్లేవారు వారి పేరును ఎన్నారై సెల్‌లో నమోదు చేసుకుని అన్ని పత్రాలు సరిగా ఉన్నాయని నిర్ధారించుకున్నాకే వెళ్లటం మంచిది. ఇలా చేసినట్లయితే ఏదేని ఇబ్బందికర పరిస్థితులు ఎదురయిన వారికి ఇక్కడి ప్రభుత్వం అండగా ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu