Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మృత్యువుతో పోరాడుతున్న శ్రావణ్

మృత్యువుతో పోరాడుతున్న శ్రావణ్
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన ఖమ్మం జిల్లా, ముచ్చర్ల గ్రామానికి చెందిన శ్రావణ్ కుమార్ (25) మృత్యువుతో పోరాడుతున్నాడు. ఇతను కోలుకునే అవకాశాలు దాదాపు లేనట్లేనని, మరో రెండు రోజుల్లో ఏ విషయం స్పష్టం చేస్తామని వైద్యులు చెప్పారని... అక్కడి ఇండియన్ కౌన్సిల్ జనరల్ అనితా నాయర్ మీడియాకు వెల్లడించారు.

కాగా... తన ముగ్గురు స్నేహితులతో కలిసి వారాంతపు సెలవులకు బయటకు వెళ్లిన శ్రావణ్‌పై కొంతమంది యువకులు స్క్రూ డ్రైవర్‌తో దాడి చేశారు. ఈ ఘటనలో శ్రావణ్ తీవ్రంగా గాయపడగా, మిగిలిన ముగ్గురు స్నేహితులు స్వల్ప గాయాలతో బయటపడిన సంగతి పాఠకులకు విదితమే.

దాడి నుండి తృటిలో తప్పించుకున్న శ్రీనివాస్ గాంధీ మాట్లాడుతూ... శ్రావణ్ పరిస్థితి విషమంగా ఉందని, డాక్టర్లేమీ చెప్పలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. శ్రావణ్ కంటిచూపు కూడా కోల్పోయాడనీ, ఎవరినీ గుర్తు పట్టలేక పోతున్నాడని భోరున విలపించాడు. దాడి చేసిన యువకులు తమను అసభ్య పదజాలంతో దూషించటమేగాకుండా, తక్షణమే భారత్‌కు తిరిగి వెళ్లిపోవాలని బెదిరించారనీ గాంధీ వాపోయాడు.

ఇదిలా ఉంటే, ఇండియన్ కౌన్సిల్ జనరల్ అనితా నాయర్.. శ్రావణ్ చికిత్స పొందుతున్న మెల్‌బోర్న్‌లోని ఆసుపత్రిని సందర్శించి, అతని ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. బయటికి వెళ్లేటప్పుడు ఎవరి భద్రతను వారే చూసుకోవాలంటూ సలహాలిచ్చిన స్థానిక పోలీసుల తీరును తీవ్రంగా దుయ్యబట్టారు.

అలాగే... భారత విదేశాంగమంత్రి ఎస్.ఎం. కృష్ణ విద్యార్థులపై దాడిని తీవ్రంగా ఖండించారు. భారతీయ విద్యార్థులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఆస్ట్రేలియా ప్రభుత్వానిదేనని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో భారత సంతతివారిపై దాడులు జరగకుండా నివారించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఆస్ట్రేలియా హై కమీషనర్ జాన్ మెక్‌కార్థి ప్రకటించటం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu