Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డల్లాస్‌లో వైభవంగా "తెలుగు వెన్నెల"

డల్లాస్‌లో వైభవంగా
"తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (టాంటెక్స్)" వారి ఆధ్వర్యంలో డల్లాస్‌లో నిర్వహించిన "నెల నెలా తెలుగు వెన్నెల" కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక స్వదేశీ ఇండియన్ రెస్టారెంట్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ కవి, రచయత డాక్టర్ జే. బాపురెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది సాహితీ ప్రియులు పాల్గొన్నారు.

కార్యక్రమం మొదటగా డాక్టర్ గన్నవరపు నరసింహమూర్తి చందోబద్ధంగా రాసిన ‘వసంత కన్య’ పద్యాలను చదివి వినిపించారు. తరువాత రమణ జువ్వాది తిక్కన మహాభారత పద్యాలను రాగయుక్తంగా ఆలాపించారు. ఆపై అన్నవరపు రంగనాయకులు నన్నయ భట్టారకుడి ఉదంకోపాఖ్యానంలోని మహాభారత పద్యాలను పాడారు. తదుపరి ఆళ్ళ శ్రీనివాసరెడ్డి పల్లె పడుచు అందాలను వర్ణిస్తూ చేసిన గీతాలాపన సభికులను ఆకట్టుకుంది.

సీత ములుకుట్ల విశ్వవిఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గురించి సభకు తెలియ చేశారు. శరత్ అకినేపల్లి ఏదో ఏదో అన్నది అనే సినీ గేయాన్ని ఆలాపించారు. ఆచార్య పుదూర్ జగదీశ్వరన్ నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమం గురించి వర్ణిస్తూ రచించిన డల్లాసాంధ్రుల శోభ అనే గేయాన్ని ఆలాపించారు.

ముఖ్య అతిథి డాక్టర్ జె. బాపురెడ్డిని తోటకూర ప్రసాద్ సభకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా బాపురెడ్డి 'ఆధునిక తెలుగు కవిత్వం - తీరుతెన్నులు' అంశంపై ప్రసంగించారు. రచనలు గేయ, పద్య, గద్య రూపాలలో ఉన్నా అవి కవిత్వంగా రాణించేందుకు, భాసించేందుకు వాటిలో ఇంపు, కుదింపు, స్ఫూర్తి ఎంతైనా ఉండాలని... అప్పుడే కవిత్వానికి మధురత్వం వస్తుందన్నారు.

ప్రాచీన సాహిత్యంలో నుండి, నన్నయ మున్నగు కవుల కవిత్వ ఉదాహరణలను, ఆధునిక సాహిత్యాలలో నుంచి గురజాడ, శ్రీశ్రీ, దేవులపల్లి కృష్ణశాస్త్రి కవిత్వ సొంపును, ప్రతిభను బాపురెడ్డి వివరించారు. ఈయన తన స్వీయకవితలతో సాహిత్య ప్రియులను ముగ్ధులను చేశారు. ముఖ్య అతిథిని ఆళ్ళ శ్రీనివాస రెడ్డి, రాజారెడ్డి శాలువతో సత్కరించారు. శ్యామల రుమాల్ల పుష్పగుచ్ఛంతో, సాహిత్య వేదిక కార్యవర్గం సభ్యులు తోటకూర ప్రసాద్, టాంటెక్స్ ప్రెసిడెంట్ శ్రీధర్ కొర్సపాటి జ్ఞాపికను అందజేశారు.

జూలై 11న సాహిత్య వేదిక ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను "సంగీత సాహిత్య నృత్య సమ్మేళనం" రూపంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు, ఈ వేడుకలకు ఎందరో సాహిత్య ప్రముఖులు తరలి వస్తున్నందున అందరినీ ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనవలసిందిగా నిర్వాహకులు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

Share this Story:

Follow Webdunia telugu