Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"యేల్" శిక్షణ ఓ గొప్ప అనుభూతి : ఎంపీల బృందం

ప్రతిష్టాత్మక "యేల్" యూనివర్సిటీలో శిక్షణ పొందటం ఓ గొప్ప అనుభూతినిస్తోందని భారత ఎంపీల బృందం వ్యాఖ్యానించింది. మరింతమంది ఎంపీలను ఇలాంటి పర్యటనలకు పంపాలని అభిప్రాయపడ్డ ఈ బృందం యేల్‌లో శిక్షణ తమ ఆలోచనా పరిధి విస్తృతికి దోహదపడిందని పేర్కొంది.

ఈ సందర్భంగా భారత ఎంపీల బృందానికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మాను సింఘ్వి మాట్లాడుతూ...రాజకీయ పరిధులతో సంబంధం లేకుండా అన్ని విషయాలపై అవగాహన కలిగించేందుకు యేల్ శిక్షణ ఉపకరించిందని పేర్కొన్నారు. దారిద్ర్య నిర్మూలన, ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక సంక్షోభం లాంటి ప్రధానాంశాలపై సమగ్రంగా చర్చించినట్లు ఆయన తెలిపారు.

అలాగే... యేల్ వర్సిటీలో తీసుకున్న శిక్షణ తమకెంతగానో ఉపయోగపడుతుందని హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన భాజపా ఎంపీ అనురాగ్ సింగ్ థాకూర్ అన్నారు. ఇది తమకు గొప్ప అనుభవమని, తమ ఆలోచనా విస్తృతికి ఇది దోహదపడుతుందని యువ ఎంపీ మహ్మద్ హమ్మదుల్లా సయ్యిద్ పేర్కొన్నారు.

యేల్ శిక్షణా కార్యక్రమం అద్భుతమని, ముంబై కాంగ్రెస్ ఎంపీ ప్రియాదత్ వర్ణించారు. ఎప్పుడూ నియోజకవర్గం, భారత్‌కు సంబంధించిన విషయాలను గురించే ఆలోచించే తమకు ప్రపంచంలో భారత్ అనుసరించాల్సిన పాత్రపై తగిన అవగాహన కలిగిందన్నారు. ఒక పరిధి దాటి ఆలోచించేలా తమను ప్రోత్సహించిందన్నారు.

ఇదిలా ఉంటే... యేల్‌లో శిక్షణా తరగతులకు హాజరయిన ఎంపీలందరూ అమెరికా నేతలు, ఉన్నతాధికారులు, మేధావులతో సమావేశమయ్యారు. తమది అధికారిక పర్యటన కాకపోయినప్పటికీ పలు విషయాలు అగ్రరాజ్యం దృష్టికి తీసుకెళ్లినట్లు భాజపా ఎంపీ ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు.

కాగా... భారత్-యేల్ పార్లమెంటరీ కార్యక్రమంలో 11 మందితో కూడిన భారత ఎంపీల బృందం యేల్ వర్సిటీలో శిక్షణా తరగతులకు హాజరయిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu