Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ్రౌన్ సమాధి పునర్మిర్మాణానికై "తాల్" కృషి

బ్రౌన్ సమాధి పునర్మిర్మాణానికై
తెలుగుభాష పునరుత్తేజానికి విశేషమైన సేవలందించిన సీపీ బ్రౌన్ సమాధి పునర్నిర్మాణానికై లండన్ తెలుగు సంఘం (తాల్) నడుం బిగించింది. ఈ మేరకు బ్రౌన్ జ్ఞాపకాలను పదిలపర్చుకునేందుకుగానూ కెన్సల్ గ్రీన్‌లో ఉన్న ఆయన సమాధిని తిరిగి నిర్మించేందుకు చర్యలు చేపట్టింది.

లండన్‌లో నివసిస్తున్న ప్రముఖ తెలుగు సాహితీ వేత్త డాక్టర్ గూటాల కృష్ణమూర్తి... బ్రౌన్ సమాధిని పునర్నిర్మించే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హిందీ అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రూపకల్పన చేయగా... ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టీ. గోపాలకృష్ణ, డాక్టర్ రాధ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో గూటాల కృష్ణమూర్తి మాట్లాడుతూ... తాళపత్ర గ్రంథాలలో నిక్షిప్తమయిన ప్రాచీన తెలుగు భాషను ప్రచురణ రూపంలోకి తేవడంతోపాటు, తెలుగు-ఆంగ్లం నిఘంటువు రూపొందించిన ఘనత బ్రౌన్‌కి దక్కిందన్నారు. తెలుగు భాషకు విశేషమైన కృషి చేసిన ఆయన జ్ఞాపకాలను పదిలపర్చుకోవడం మనందరి కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు.

బ్రౌన్ సమాధిని పునర్నిర్మించేందుకు ముందుకొచ్చిన లండన్ తెలుగు సంఘాన్ని ఈ సందర్భంగా లక్ష్మీప్రసాద్ అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో తాల్ అధ్యక్షు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి, ట్రస్టీలతో పాటు పలువురు కార్యవర్గ సభ్యులు, స్థానికంగా నివసించే తెలుగువారు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu