Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి

తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి
FILE
ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన మరో మరో తెలుగు విద్యార్థి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. టెక్సాస్ రాష్ట్రంలోని బీమాంట్‌లో ఉన్న లామార్ యూనివర్సిటీలో ఎం.ఎస్. చేస్తోన్న ధీరజ్ సుఖవాసి అనే 23 సంవత్సరాల యువకుడు సోమవారం రాత్రి 8.30 గంటలకు ఆకస్మికంగా మృతి చెందినట్లు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) వెల్లడించింది. అయితే.. ఇతడి మృతికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.

లామర్ యూనివర్సిటీలో ఎం.ఎస్. విద్యను అభ్యసిస్తున్న ధీరజ్.. అక్కడి ఒక హోటల్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. విధులు నిర్వహించుకుని ఇంటికి తిరిగి వచ్చిన అతడు.. ఒళ్లు నొప్పుల కోసం ఏదో టాబ్లెట్ వేసుకున్నాడు. అయితే కొంతసేపటికే అతడి పరిస్థితి విషమించి మరణించాడని ప్రాథమిక సమాచారం. ఇతడి మృతి వెనుకగల కారణాలను కనుగొనేందుకు స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తానా పేర్కొంది.

ధీరజ్ వేసుకున్న టాబ్లెట్‌లో అతడి శరీరానికి సరిపోని కెమికల్ కాంపోనెంట్ ఏదైనా అందులో ఉండి ఉండటంవల్ల మరణించాడా..? లేదా మరేదైనా కారణం ఉండవచ్చన్న విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. కాగా.. హైదరాబాద్‌లో నివాసం ఉంటోన్న ధనంజయరావు, శైలజల పెద్ద కుమారుడు ధీరజ్. ఇతడికి ఇంటర్మీడియట్ చదివే తమ్ముడు ఉన్నాడు. తండ్రి హెచ్.సి.ఎల్. ఉద్యోగి.

ఇదిలా ఉంటే.. ధీరజ్ మృతదేహాన్ని హైదరాబాద్ పంపించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షుడు జయరాం కోమటి, కార్యదర్శి మోహన్ నన్నపనేని, ప్రెసిడెంట్ ఎలక్ట్ ప్రసాద్ తోటకూర కృషి చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా ధీరజ్ మృతదేహాన్ని అతడి స్వస్థలానికి పంపించేందుకు యూనివర్సిటీ, కాన్సులేట్ అధికారులను సంప్రదించినట్లు ప్రసాద్ తోటకూర వివరించారు. ఈ సందర్భంగా ఆయన ధీరజ్ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.

Share this Story:

Follow Webdunia telugu