Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టెక్సాస్‌లో ఘనంగా "తెలుగు సాహిత్య సదస్సు"

టెక్సాస్‌లో ఘనంగా
FILE
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్, తెలుగు సాహిత్య వేదికలు సంయుక్తంగా నిర్వహిస్తున్న 23వ "తెలుగు సాహిత్య సదస్సు", 27వ "నెల నెలా తెలుగు వెన్నెల" కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. టెక్సాస్‌లోని ఓమ్నిఫోర్ట్‌వర్త్ హోటల్‌లో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తెలుగుభాష ప్రాచీనతను, భాషలోని మాధుర్యాన్ని ప్రవాస చిన్నారులకు, భావితరాలకు అందించే కృత నిశ్చయంతో అమెరికాలోని ప్రవాస తెలుగు సంఘాలు చేస్తున్న కృషికి నిదర్శనంగా పై రెండు కార్యక్రమాలను చెప్పవచ్చు. మూడు అంచెలుగా నిర్వహించిన ఈ వేడుకలు సాహితీ ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ప్రముఖ కథా రచయిత కేతు విశ్వనాథ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం అమెరికా తెలుగు పుస్తక సమాఖ్య, శ్రీశ్రీ రచించిన "సిప్రాలి" శతక పద్య పుస్తకాన్ని ఆవిష్కరించారు. తరువాత ఇటీవల ఆకస్మికంగా మరణించిన మానవహక్కుల ఉద్యమయోధుడు బాలగోపాల్ జీవిత విశేషాలను సాజి గోపాల్ సభికులకు వివరించారు.

మొదటి అంకంలో భాగంగా త్రిపురనేని గోపీచంద్ రచనలపై మందపాటి సత్యం ప్రసంగించగా.. కొడవగంటి కుటుంబరావు రచనలపై విష్ణుబొట్ల లక్ష్మన్న సాహిత్యోపన్యాసం చేశారు. అలాగే శ్రీశ్రీ రచనలపై మద్దుకూరి చంద్రహాస్ చేసిన లోతైన విశ్లేషణ సాహిత్య ప్రియులను మంత్రముగ్ధుల్ని చేసింది. రెండో అంకంలో "తెలుగు కథలో పరిణామం" అనే అంశంపై జంపాల చౌదరి ఉపన్యసించారు.

చివరిగా.. "భారతీయ సంస్కృతి-వేద సాహిత్యం"పై డాక్టర్ సంధ్యావందనం లక్ష్మీదేవి ప్రసంగం.. "ఆంధ్ర శతక సాహిత్యం-మానవ వనరుల నిర్వహణ"పై తుర్లపాటి ప్రసాద్‌లు ఉపన్యసించారు. "కథ శత జయంతి-ప్రాంతీయ కథా సాహిత్యం"పై విశ్వనాథరెడ్డి చేసిన ప్రసంగం సభికులను ఆలోచింప జేసింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయనను సాహితీ వేదిక కార్యవర్గం, టాంటెక్స్‌లు ఘనం సత్కరించాయి.

Share this Story:

Follow Webdunia telugu