Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆసీస్ వర్సిటీలపై విదేశీ విద్యార్థుల అనాసక్తి..!!

ఆసీస్ వర్సిటీలపై విదేశీ విద్యార్థుల అనాసక్తి..!!
FILE
ఆస్ట్రేలియాలో గత కొంతకాలంగా భారతీయ విద్యార్థులపై జరుగుతున్న జాత్యహంకార దాడుల నేపథ్యంలో ఆ దేశానికి వెళ్లాలంటేనే విదేశీయులు భయపడాల్సిన పరిస్థితి దాపురించిన సంగతి తెలిసిందే. అలాగే ఆసీస్‌లో నిర్దిష్ట విద్యా ప్రమాణాలు పాటించని ప్రైవేటు విద్యా సంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలకు దిగటంతో విదేశీ విద్యార్థులు ఆ దేశం వెళ్లే విషయమై పునరాలోచనలో పడ్డారు.

ఆస్ట్రేలియాలోని విద్యా సంస్థల్లో చేరేందుకు అమితాసక్తిని ప్రదర్శించే భారతీయులు సైతం అక్కడికి వెళ్లేందుకు తటపటాయిస్తున్నారు. అలాగే తాజా పరిస్థితుల నేపథ్యంలో విదేశీ విద్యార్థులు ఇక్కడి కళాశాలల్లో చేరేందుకు వెనుకాడుతున్నారు. దీంతో ఆసీస్ ప్రైవేటు విద్యా సంస్థలు ముందుముందు గడ్డు కాలాన్ని ఎదుర్కొనే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి.

ఈ మేరకు డిప్యూటీ హై కమీషనర్ వీకే. శర్మ మాట్లాడుతూ... నిర్దిష్ట విద్యా ప్రమాణాలు పాటించని మూడు కళాశాలలను ప్రభుత్వం ఇటీవలే మూసివేసిందని చెప్పారు. అలాగే సిడ్నీలోని స్టార్నింగ్ ఇనిస్టిట్యూట్, మెల్‌బోర్న్‌లోని మెల్‍‌బోర్న అంతర్జాతీయ కళాశాలలోని 200 మంది భారత విద్యార్థులతో సహా, 363 మందిని ఇతర విద్యా కేంద్రాలకు తరలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

అయితే నియమాలు పాటించని కళాశాల గుర్తింపు రద్దుతో సమస్య తీరిపోదని.. వాటి యజమానులు మారు పేరుతో ఆయా సంస్థలను తిరిగీ ప్రారంభించే అవకాశాలు లేకపోలేదని శర్మ హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ తగ్గుముఖం పడుతుందని మెల్‌బోర్న్‌లో పలు కళాశాలలకు సంకేతాలు వెలువడినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రైవేటు విద్యా సంస్థల వివరాల కోసం భారత విద్యార్థుల ఎంక్వైరీ తగ్గుముఖం పట్టిందనీ, గత ఏడాదితో పోల్చినట్లయితే ఎంక్వైరీ 20 శాతం మేరకు పడిపోయిందని ప్రైవేటు విద్యా సంస్థ అకడమిక్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ మెల కౌముడెస్ పేర్కొనడం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu