Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆసీస్ దాడులపై భారత్‌తో గొంతు కలిపిన చైనా

ఆసీస్ దాడులపై భారత్‌తో గొంతు కలిపిన చైనా
ఆస్ట్రేలియాలో విదేశీ విద్యార్థులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ చైనా కూడా భారత్‌తో గొంతు కలిపింది. భారత విద్యార్థులపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో, తమ విద్యార్థుల భద్రతపై కూడా అప్రమత్తమైన చైనా... విదేశీ విద్యార్థుల హక్కుల్ని రక్షించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.

కాగా... ఆస్ట్రేలియాలో దాదాపు లక్షా ముప్పై వేల మంది చైనా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే, ఇటీవలి కాలంలో తమ దేశ విద్యార్థులపై కూడా దాడులు జరుగుతున్నాయని ఆస్ట్రేలియాలోని చైనా రాయబారి లియు జిన్ పేర్కొన్నారు. అయితే ఆ దాడుల సంఖ్యనుగానీ, వివరాలనుగానీ చెప్పేందుకు ఆయన నిరాకరించారు.

చైనాతో సహా ఇతర విదేశీ విద్యార్థుల భద్రతకు ఆస్ట్రేలియా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని లియుపేర్కొన్నట్లు... సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ విషయంలో తమ ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుంటుందని ఆయన అందులో వెల్లడించారు.

విద్యార్థుల భద్రతకు విశ్వవిద్యాలయాలు తీసుకుంటున్న చర్యలపై చర్చించేందుకు భారత హై కమీషనర్ సుజాత సింగ్ అన్ని విశ్వవిద్యాలయాల డిప్యూటీ ఉప కులపతులతో సమావేశం కానున్నారు. అలాగే... దాడులపై చర్చించేందుకు భారత విద్యార్థి ప్రతినిధులు, భారతీయ సంఘాల నాయకులతో న్యూ సౌత్ వేల్స్ ప్రభుత్వాధికారులు, నాయకులు సమావేశం కానున్నారు.

ఇదిలా ఉంటే... సాధారణ సౌకర్యాలు కల్పించమని అడిగినందుకే, విశ్వ విద్యాలయం అధికారులు తనను దూషించారని మెల్‌బోర్న్ విశ్వ విద్యాలయం మాజీ భారత విద్యార్థి రిచర్డ్ హార్వీ (38) ఆరోపిస్తున్నారు. 2007లో ఇక్కడి మిరిడియన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో విద్యను అభ్యసించిన హార్వీ... కళాశాలలో తాగునీరు, టాయిలెట్ పేపర్‌ను అందుబాటులో ఉంచాలన అడిగినందుకు అధికారులు తనను తీవ్రంగా దూషించినట్లు వాపోయాడు.

"బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన చేసే దేశం నుంచి వచ్చిన నువ్వు.. ఇక్కడ టాయ్‌లెట్ పేపర్ కల్పించమని ఆశిస్తున్నావా..?" అంటూ తనను దూషించారని హార్వీ చెప్పారు. ఆ క్షణంలో వారి మాటలను విన్న తాను షాక్‌కు గురయ్యాననీ, దీనిపై వర్సిటీ అధికారుల నుంచి క్షమాపణలు చెప్పాలని హార్వీ డిమాండ్ చేస్తున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu