Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆధారాల సేకరణలో భారత కాన్సులేట్: వయలార్ రవి

ఆధారాల సేకరణలో భారత కాన్సులేట్: వయలార్ రవి
FILE
ఒక పాకిస్థాన్ జాతీయుడి హత్య కేసులో 17 భారతీయులకు యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) న్యాయస్థానం మరణదండన విధించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ కేసులో శిక్ష పడిన భారతీయులు, అప్పీల్ చేసుకునేందుకు వీలుగా మరిన్ని ఆధారాలను సేకరించాల్సిందిగా తాము ఇప్పటికే యూఏఈలోని భారత కాన్సులేట్‌ను కోరినట్లు కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రి వయలార్ రవి ఈ మేరకు వెల్లడించారు.

ఇందులో భాగంగా భారత కాన్సులేట్ ఈ కేసులో మరిన్ని ఆధారాలు, వివరాల సేకరణకు పూనుకుంది. అలాగే 17 మంది భారతీయులపై విధించిన మరణశిక్ష జడ్జిమెంట్ కాపీని సైతం సేకరించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఒక పాకిస్థాన్ జాతీయుడిని పొడిచి చంపటమేగాకుండా, మరో ముగ్గురు పాక్ దేశస్థులను గాయపరిచారన్న అభియోగాలు రుజువు కావటంతో సదరు భారతీయులకు షార్జాలోని షరియా కోర్టు న్యాయమూర్తి యూసఫ్ అల్ హమాదీ మరణదండన విధించారు.

మరోవైపు.. ఈ కేసులో మరణశిక్షకు గురైన భారతీయులందరూ 17 నుంచి 30 సంవత్సరాల వయస్సు కలిగినవారే కావటం గమనార్హం. నిందితులందరూ హత్యకు పాల్పడినట్లుగా డీఎన్‌ఏ నివేదికతోపాటు ఆధారాలు కూడా బలంగా ఉండటంతో కోర్టు వారికి మరణదండన విధించినట్లు స్థానిక పత్రికలు పలు కథనాలను వెల్లడించాయి.

అక్రమ సారా వ్యాపారం ఆధిపత్యం విషయంలో జరిగిన ఈ గొడవలో భారతీయులు కత్తులతో పాకిస్థానీయులపై దాడికి పాల్పడ్డారు. గత సంవత్సరం జనవరి నెలలో షార్జాలోని ఆల్ సాజా ప్రాంతంలో ఈ గొడవ జరిగింది. అప్పట్లో ఈ దాడిలో గాయపడిన ముగ్గురు పాకిస్తానీయులు భారతీయుల నుంచి తప్పించుకుని కువైట్ ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu