Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మార్పును స్వాగతిస్తున్న 2009

మార్పును స్వాగతిస్తున్న 2009
, సోమవారం, 5 జనవరి 2009 (19:21 IST)
2008 సంవత్సరం పాతబడిపోయింది. కొత్త సంవత్సరంగా 2009 కాలచక్రంలో ముందు నిలిచింది. పాత సంవత్సరం మధుర జ్ఞాపకాలకంటే పీడకలలను, దుస్సంఘటనలను ఎక్కువగా గుర్తుకు తెస్తూ ముగిసింది. ఉగ్రవాదం విసిరిన పంజా దెబ్బకు ముంబై, ఇస్లామాబాద్‌లో జనజీవితం స్తంభించిపోవడం ఓ వాస్తవం కాగా మరోవైపు చైనాలో భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాలు లక్షలాది మంది ప్రాణాలను హరించాయి. ఇకపోతే వీటన్నిటికంటే మించి, ప్రపంచవ్యాప్తంగా జనజీవితాలను కల్లోలపర్చిన మార్కెట్ల పతనం కళ్లముందు కదులాడుతూనే ఉంది.

అయితే పాత సంవత్సరం ఓ దేశ చరిత్రలో అద్భుతమైన అధ్యాయానికి తెర తీసింది. బానిసత్వానికి పట్టం గట్టి ఆఫ్రికా ఖండం నుంచి బలవతంగా తీసుకువచ్చిన లక్షలాది మంది నల్లజాతి వారికి పౌరహక్కులనేవే లేకుండా చేసి అత్యంత హేయమైన దుష్కీర్తిని సొంతం చేసుకున్న అమెరికా తన చరిత్రలో మొట్టమొదటి సారిగా ఓ నల్లజాతి అమెరికన్‌కు పట్టం గట్టింది.

ఏ విప్లవాలు లేవు.... తిరుగుబాట్లు లేవు... హింసాత్మక కార్యక్రమాలు లేవు... కాని అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్రలో 2008 చిరస్మరణీయమైన గుర్తును శిలాఫలకంలా ముద్రించి మరీ వెళ్లింది. ఆ గుర్తు పేరు మార్పు. దానికి మరో పేరు ఒబామా. అమెరికా ప్రజాస్వామ్య మూలాలను మరింత పటిష్టం చేసిన ఘటనకు 2008 అమెరికా అధ్యక్ష ఎన్నికలు నాంది పలికాయి.

నల్లజాతి వ్యక్తిని అధ్యక్ష పీఠంపై కూర్చుండబెట్టిన ఈ ఎన్నికలు అమెరికాలో నిజమైన మార్పును శ్రీకారం చుట్టాయి. వర్ణవివక్షతకు మారుపేరుగా నిలిచిన అమెరికా.... నల్లజాతి వజ్రం ఒబామాకు పట్టం కట్టడంద్వారా మార్పు పవనాలు మొదలై ప్రపంచమంతటా మార్పు మంత్ర జపం పఠించటం మొదలు పెట్టింది.

అమెరికా అధ్యక్షుడిగా ఒబామా ఎన్నిక రాబోయే తరాల చరిత్రపై గణనీయంగానే పడనుంది. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా ప్రపంచమంతటా ఒబామా ఎంపికను హర్షించింది. అమెరికా అంటే బద్ధ శత్రుత్వంతో వ్యవహరిస్తున్న అరబ్ దేశాలు, ఇస్లామిక్ ప్రపంచం మొత్తంగా కాస్సేపు తమ వ్యతిరేకతను పక్కన బెట్టి ఒబామా విజయాన్ని కొనియాడింది.

జనవరి 20న అధ్యక్షపీఠాన్ని అధిరోహించిన తర్వాత ఒబామా బరాక్ నూతన ప్రపంచంలో మార్పుకు సంబంధించిన చర్యలకు శ్రీకారం చుట్టనున్నారని ప్రపంచం ఆశిస్తోంది. ప్రపంచంలో ప్రతిఒక్కరూ మార్పును కోరుకుంటున్నారు. దేశాలు, ప్రభుత్వాలు, ప్రజలు ప్రతి ఒక్కరూ మార్పును జపిస్తున్నారు.

ఈ మార్పు ఏమిటో, అది ఎలా జీవితాల్లోకి ప్రవహిస్తుందో చూడడానికి 2009 నూతన సంవత్సరం సాక్షీభూతంగా నిలువనుంది.

Share this Story:

Follow Webdunia telugu