తమిళనాడు రాష్ట్రంలో అధికార అన్నాడీఎంకే శాసనసభ్యుడొకరు గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఇటీవల వెల్లడైన ఆ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో అన్నాడీఎంకే వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన విషయం తెల్సిందే. దీంతో ఆ పార్టీ శ్రేణులు, నేతులు ఆనందోత్సవాల్లో మునిగిపోయివున్నారు. వీటి నుంచి ఇంకా తేరుకోక ముందే ఆ పార్టీ శ్రేణులు విషాదంలో మునిగిపోయారు.
మదురై జిల్లా తిరుప్పరుకుండ్రం ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీనివేల్ (65) బుధవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఈయనకు బుధవారం వేకవజామున గుండెనొప్పి రావడంతో సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న క్రమంలోనే మరోమారు గుండెపోటు వచ్చింది. దీంతో బుధవారం ఉదయం కన్నుమూశారు. దీంతో సంబరాల్లో మునిగితేలుతున్న అన్నాడీఎంకేలో విషాద ఛాయలు అలముకున్నాయి.
కాగా, 65 యేళ్ళ శ్రీనివాసన్ పార్టీలో గత 25 యేళ్లుగా పని చేస్తున్నారు. గత 2001లో ఇదే స్థానం నుంచి తొలి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. 2006లో కూడా విజయం సాధించారు. ఇపుడు మళ్లీ మరోమారు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నింకల్లో ఆయన డీఎంకే అభ్యర్థి మణిమారన్‌పై 22992 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో తమిళనాడు రాష్ట్ర శాసనసభలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సంఖ్య 134 నుంచి 133కు తగ్గింది.