Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్వాతి హత్య కేసు.. నిందితుడి అరెస్ట్: 3 నెలల పాటు లవ్ చేశాడు.. గది నెం.404లో.. ఉంటూ..?!

చెన్నై టెక్కీ స్వాతి హత్య కేసు నిందితుడు రామ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరునెల్వేలి సెంగోట్టై సమీపంలో పోలీసులు నిందితుడికి అరెస్ట్ చేశారు. పోలీసులను చూసిన వెంటనే బ్లేడుతో గొంతుకోసుకునేందుకు

స్వాతి హత్య కేసు.. నిందితుడి అరెస్ట్: 3 నెలల పాటు లవ్ చేశాడు.. గది నెం.404లో.. ఉంటూ..?!
, శనివారం, 2 జులై 2016 (12:15 IST)
చెన్నై టెక్కీ స్వాతి హత్య కేసు నిందితుడు రామ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరునెల్వేలి సెంగోట్టై సమీపంలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసులను చూసిన వెంటనే బ్లేడుతో గొంతుకోసుకునేందుకు ప్రయత్నించాడు. చెన్నై చూలైమేడులో నివసిస్తున్న స్వాతి గత 24వ తేదీ (జూన్ 24) హత్యకు గురైన సంగతి తెలిసిందే. సెంగోట్టై, మీనాక్షి పురంకు చెందిన రామ్ కుమార్ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతడు తిరునల్వేలిలోనే ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. 
 
ఈ క్రమంలో ఫోటో ఆధారంగా స్వాతి కేసులో ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు అనుమానించడం, అతన్ని పట్టుకునేందుకు వెళ్లగానే సూసైడ్ ప్రయత్నం చేయటంతో అతడే నిందితుడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం అతను ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి ఏమంత ప్రమాదకరంగా లేదని వైద్యులు తెలిపారు. పోలీసు ప్రత్యేక బృందం అతన్ని విచారించేందుకు సిద్ధంగా ఉంది.  
 
రామ్ కుమార్ ఎలా పట్టుబడ్డాడు?
రామ్ కుమార్ సెంగోట్టై సమీపంలో ఉన్న మీనాక్షిపురంకు చెందినవాడు. ఇతడు ఆలంగుళం ఇంజనీరింగ్ కాలేజీలో బీఈ చదివాడు. ఉద్యోగం కోసం చెన్నైకి వచ్చిన రామ్ కుమార్.. చూలైమేడులోని ఓ మాన్షన్‌లో గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. అప్పుడు స్వాతి ప్రేమలో పడ్డాడు.

అయితే రామ్ కుమార్ ప్రేమను స్వాతి నిరాకరించింది. రామ్ కుమార్ 3 నెలల పాటు తనను ప్రేమించాల్సిందిగా వేధించాడు. కానీ ఆమె ప్రేమను అంగీకరించకపోవడంతో నుంగంబాక్కం రైల్వేస్టేషన్లో ఆమెను కత్తితో నరికి దారుణంగా హత్యచేశాడు. ఇందుకు రామ్ కుమార్‌ స్నేహితుడు కూడా సాయం చేశాడు. 
 
స్వాతి హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సీసీటీవీ ఫూటేజ్‌తో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఫూటేజ్ ఆధారంతో నిందితుడి ఆచూకీ కనిపెట్టారు. స్వాతి హత్య కేసు నిందితుడిని పట్టుకునేందుకు డిప్యూటీ కమిషనర్ శంకర్ నేతృత్వంలో 8 మందితో కూడిన బృందం బరిలోకి దిగింది.

ఇంకా స్వాతి హత్య జరిగిన స్థలంలో ఆమె మొబైల్ ఫోన్‌ను హంతకుడే ఎత్తుకెళ్లిపోవడం పోలీసులకు కలిసొచ్చింది. ఆ ఫోన్ నెంబర్‌ను ఎస్ఎమ్‌ఎస్ ద్వారా ట్రేస్ చేసిన పోలీసులు.. రామ్ కుమార్ బస చేసిన చూలైమేడు ప్రాంతంలో తీవ్రంగా తనిఖీలు చేశారు. 
 
ఇలా రామ్ కుమార్ గదిలో తనిఖీలు చేసిన పోలీసులు.. రామ్ కుమారే స్వాతిని హత్య చేసిన నిందితుడని గుర్తించారు. దీంతో తిరునెల్వేలికి చెక్కేసిన రామ్‌కుమార్‌ను పోలీసులు పక్కా ప్లాన్‌తో అరెస్ట్ చేశారు. శుక్రవారం అర్థరాత్రి రామ్ కుమార్‌ను పట్టుకునేందుకు పోలీసులు పక్కా స్కెచ్ వేశారు. పోలీసులు రామ్ కుమార్‌ను పట్టుకునేదుకు వెళ్లగానే అతడు పోలీసుల్ని చూసిన షాక్‌తో తన గొంతుకోసుకునే ప్రయత్నం చేశాడు.

అతనికి ప్రాథమిక చికిత్స అందిస్తుండగా పోలీసులు జరిపిన విచారణలో స్వాతిని తానే హత్య చేసినట్లు ఒప్పేసుకున్నట్లు తెలిసింది. బ్లేడుతో గొంతు కోసుకునేందుకు ప్రయత్నించిన రామ్ కుమార్ గొంతుకు ఆపరేషన్‌ జరిగింది. చిన్నపాటి ఆపరేషన్ తర్వాత రామ్ కుమార్ వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 
రామ్ కుమార్ నేపథ్యం: 
రామ్‌కుమార్ తండ్రి పేరు పరమశివం. అతని భార్య, రామ్ కుమార్ సోదరీసోదరుల వద్ద పోలీసులు విచారణ జరిపారు. ఇక రామ్‌ కుమార్‌ను చెన్నైకి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. చూలైమేడులోని ఓ మాన్షన్‌లో గది నెం.404లో బస చేసిన రామ్ కుమార్.. మూడు నెలల పాటు ఉద్యోగం కోసం వెతుకులాట ప్రారంభించాడు. ఈ మ్యాన్షన్‌కు నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌కు అర కిలోమీటర్ దూరమే ఉంటుంది.

అలాగే రామ్ కుమార్ మాన్షన్‌కు స్వాతి ఇంటికి అరకిలోమీటర్ దూరమే ఉంటుంది. స్వాతి ఇంటి నుంచి బయటికొచ్చేటప్పుడు ఆమెను చూసే అవకాశం రామ్ కుమార్‌కు ఉండేది. స్వాతి హత్యకు గురైన రోజు రైలు కోసం స్టేషన్లో వేచివుండగా.. అదే రోజు ఉదయం 6.45 గంటలకు స్టేషన్‌కు వచ్చిన రామ్ కుమార్.. ఆమెతో వాగ్వివాదానికి దిగాడు. ఆపై దాడి చేశాడు. తర్వాతే దాచిపెట్టుకున్న కత్తితో స్వాతిని నరికి దారుణంగా చంపేశాడు. ఇక రామ్ కుమార్ బస చేసిన మాన్షన్‌లో విచారణ జరుగుతున్న కారణంగా మాన్షన్‌ నుంచి ఎవ్వరూ బయటికి రాకూడదని పోలీసులు నిబంధన విధించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మియామీలో పోలీసులకు షాక్: శివాజీ సినీ ఫక్కీలో క్యాష్.. 24 బక్కెట్లలో కోట్ల కొద్దీ డబ్బు!