Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గురి తప్పిన స్వామి బాణం.. అమ్మకు కాకుండా చిన్నమ్మకు తగిలిందా?

జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం బీజేపీ ఎంపీ అయిన సుబ్రహ్మణ్య స్వామి పట్టుపట్టారంటే కొందరి తలరాతలు మారడమే కాదు.. ప్రభుత్వాలే కూలిపోతాయన్నది కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తన రాజకీయ జీవితంలో ఓటమిని అంగీకరించని ధీరవనిత జయలలితను 20 ఏళ్లుగా వెంటాడిన

గురి తప్పిన స్వామి బాణం.. అమ్మకు కాకుండా చిన్నమ్మకు తగిలిందా?
హైదరాబాద్ , బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (01:50 IST)
జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం బీజేపీ ఎంపీ అయిన సుబ్రహ్మణ్య స్వామి పట్టుపట్టారంటే కొందరి తలరాతలు మారడమే కాదు.. ప్రభుత్వాలే కూలిపోతాయన్నది కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తన రాజకీయ జీవితంలో ఓటమిని అంగీకరించని ధీరవనిత జయలలితను 20 ఏళ్లుగా వెంటాడిన అక్రమాస్తుల కేసు సృష్టికర్త స్వామి. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధాని పదవిని ఒక్కఓటు తేడాతో కూల్చివేసిన ఘనత కూడా స్వామిదే. నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తులను స్వంతానికి మళ్లించుకున్న ఘటనలో సోనియాగాంధీ, రాుహల్ గాంధీలకు కూడా చుక్కలు చూపించిన ఘనత కూడా స్వామిదే. కాని 20 ఏళ్లకు ముందు జయలలితకు ఆయన గురిపెట్టిన బాణం నేడు సూటిగా శశికళకు గుచ్చుకోవడం గమనార్హం. శశికళ ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి బలంగా మద్దతిస్తున్న వారిలో బీజేపీ ఎంపీ సుబ్రమణ్యంస్వామి అగ్రస్థానంలో ఉంటున్నప్పుడు ఆయన గతంలో వేసిన కేసు ఇప్పుడు శశికళ మెడకు చుట్టుకుని ఆమె రాజకీయ ఆశలను సమాధి చేయడం మరీ విశేషం. 
 
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను తక్షణమే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను బహిరంగంగా డిమాండ్‌ చేయడమే కాకుండా శశికళను ఆహ్పానించకుంటే గవర్నర్ పైనే కేసు పెడతానని బెదిరించిన సుబ్రహ్మణ్య స్వామి ఇరవై ఏళ్ల కిందట జయలలిత లక్ష్యంగా పేల్చిన తూటా.. ఇప్పుడు శశికళను కూల్చడమే పరమ విషాదకరం. స్వామి బాణం శశికళ సీఎం కలను కల్లలు చేసి మళ్లీ జైలు పాలు చేయడం వింతల్లోకెల్లా వింత. 
 
నిజానికి 1996లో జయలలిత అక్రమాస్తులపై స్వామి (అప్పుడు జనతా పార్టీ అధ్యక్షుడు) ఫిర్యాదు చేసినపుడు అందులో ఆమె పేరు ఒక్కటే ఉంది. శశికళ తదితరుల పేర్లు లేవు. విచారణ కోర్టు తీర్పు ప్రకారం.. 1987లో జయలలిత మొత్తం ఆస్తుల విలువ రూ. 7.5 లక్షలు మాత్రమే. అందులో ఎక్కువ భాగం ఆమె తల్లి ఎన్‌ఆర్ సంధ్య నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులే ఉన్నాయి. అదనంగా రూ. 1 లక్ష నగదు ఉంది. ఆ ఏడాది ఎంజీఆర్‌ మరణించిన తర్వాత ఆమె రాజకీయాల్లో పూర్తిగా క్రియాశీలకం అయ్యారు. 1991 ఎన్నికల్లో గెలిచి అధికారంలో వచ్చారు. 
కానీ 1996లో జయలలిత ఓడిపోయిన నెల రోజుల్లోనే సుబ్రమణ్యంస్వామి ఆమెపై అవినీతి ఆరోపణలతో ఫిర్యాదు చేశారు. ‘‘జయలలిత 1989-90 లో ప్రకటించిన ఆస్తులు ఏమీలేవు. కానీ ఆమె ముఖ్యమంత్రిగా నెలకు కేవలం 1 రూపాయి వేతనం తీసుకున్నారు. 1990-91లో ఆమె ఆస్తులు రూ. 1.89 కోట్లకు పెరిగాయి. 1991-92 నాటికి రూ. 2.60 కోట్లకు, 1992-93 నాటికి రూ. 5.82 కోట్లకు, 1993-94 నాటికి రూ. 91.33 కోట్లకు, 1994-95 నాటికి రూ. 38.21 కోట్లకు పెరిగాయి’’ అని స్వామి తన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై చెన్నైలోని ప్రత్యేక కోర్టు దర్యాప్తుకు ఆదేశించింది.
 
ప్రాథమిక దర్యాప్తు అనంతరం 1996 డిసెంబర్‌లో జయలలితను అరెస్ట్‌ చేసిన తర్వాత.. ఆమె నివాసం పొయెస్‌ గార్డెన్‌లో సోదాలు నిర్వహించారు. భారీ మొత్తంలో బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో శశికళ, ఆమె బంధువుల పాత్రపై కూడా ఆధారాలు లభించాయి. శశికళను రెండో ముద్దాయిగా, ఆమె మేనల్లుడు వి.ఎన్‌.సుధాకరన్‌ను మూడో ముద్దాయిగా, శశికళ వదిన జె.ఇళవరసిని నాలుగో ముద్దాయిగా ఇదే కేసులో చేర్చారు. 1997 జూన్‌లో నిందితులు నలుగురిపైనా చార్జ్‌షీట్‌ నమోదు చేశారు. 
 
‘‘ఆరోపిత నేరంలో ఎ2 నుంచి ఎ4 వరకూ పాలుపంచుకున్నారని దర్యాప్తు సందర్భంగా సేకరించిన సాక్ష్యాలు చెబుతున్నాయి’’ అని విచారణ కోర్టు పేర్కొంది. ఆ అభియోగాల నుంచి తమను మినహాయించాలంటూ శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లు సమర్పించిన దరఖాస్తులను కోర్టు 1997 అక్టోబర్‌లో తిరస్కరించింది. ఆ ముగ్గురూ రూ. 66.65 కోట్ల అక్రమాస్తులను సంపాదించిన నేరపూరిత కుట్రలో పాలుపంచుకున్నారని, వాటిలో ఎక్కువ భాగాన్ని తమ పేర్లపై కలిగివున్నారని, వారి పేర్లపై 32 వ్యాపారాలను ప్రారంభించారని నేరాభియోగాలు నమోదు చేశారు. 
 
అలా ఇరవై ఏళ్ల కిందట జయలలితపై ప్రారంభమైన అవినీతి కేసు విచారణ ఆ తర్వాత శశికళ తదితరులను కూడా నిందితులుగా చేర్చడంతో.. అనేక మలుపుల అనంతరం, జయలలిత కన్నుమూసిన తర్వాత.. మిగతా ముగ్గురినీ జైలుకు పంపించింది.
 
1991 నుంచి 96 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, రూ.66 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టారన్నది సుబ్రమణ్యస్వామి ఆరోపణ. 1996లో జయ తన దత్తపుత్రుడు సుధాకర్ పెళ్లి కోట్లు కుమ్మరించి కనీవినీ ఎరుగని రీతిలో చేయడం ఆమెపై ఆరోపణలకు బలం చేకూర్చాయి. ఆమె అక్రమాస్తులుగా పేర్కొన్నవాటిలో పెద్ద ఎత్తున వ్యవసాయ భూమలు, నీలగిరి కొండల్లో టీ ఎస్టేట్, లగ్జరీ కార్లు, కోట్ల విలువైన ఆబరణాలు, బ్యాంకుల్లో నగదు నిల్వలు ఉన్నాయి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం సీట్లో కూర్చొనేందుకు ఆరోగ్యం భేష్.. జైలుకెళ్లేందుకు అనారోగ్యం.. శశికళ