Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాన్సెన్స్ ఆ మాటలు మాట్లాడేవారు ఎవరో చేయి పైకిలేపండి.. ఉగ్రరూపుడైన నితీశ్

నాన్సెన్స్ ఆ మాటలు మాట్లాడేవారు ఎవరో చేయి పైకిలేపండి.. ఉగ్రరూపుడైన నితీశ్
, గురువారం, 22 అక్టోబరు 2020 (10:21 IST)
బిహార్ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత నితీశ్ కుమార్‌కు చిర్రెత్తుకొచ్చింది. తాను పాల్గొన్న బహిరంగ సభలో లాలూ ప్రసాద్ యావద్ జిందాబాద్.. లాలూ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఇవి తన చెవినపడటంతో నితీశ్‌కు పట్టరాని కోపం వచ్చింది. వెంటనే.. ఆ నాన్సెన్స్ మాటలు మాట్లాడేవారు ఎవరో చేయి పైకిలేపండి అంటూ మండిపడ్డారు. 
 
బిహార్ రాష్ట్ర శాసనసభకు మూడు దశల్లో ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఇందులోభాగంగా తొలి దశ పోలింగ్ వచ్చేవారం జరుగనుంది. దీంతో తొలి విడ పోలింగ్ జరిగే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా, విపక్ష నేత, ఆర్జేడీకి చెందిన  తేజస్వీ యాదవ్ ఎన్నికల ప్రచారానికి జనాలు పోటెత్తుతున్నారు. 
 
తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ చేస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రతి ప్రచారంలోనూ తేజస్వీ యాదవ్ ఇదే మాటను పదేపదే చెబుతున్నారు. ఆయన ప్రచారానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. 
 
ఈ క్రమంలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన ప్రచారంలో 'లాలు యాదవ్ జిందాబాద్' అని కొందరు నినదించడంతో నితీశ్ తీవ్రంగా మండిపడ్డారు. 
 
"ఏం చెబుతున్నారు? ఏం చెబుతున్నారు?" అని తన ప్రసంగం మధ్యలోనే గట్టిగా అరిచేశారు. "ఆ నాన్సెన్స్ మాటలు మాట్లాడేవారు ఎవరో చేయి పైకి లేపండి" అని గద్దించారు. కాసేపు నిశ్శబ్దం తర్వాత 'దాణా దొంగ' అని ఎవరో గట్టిగా అరవడం వినిపించింది. 
 
అనంతరం నితీశ్ తన ప్రసంగాన్ని తిరిగి ప్రారంభిస్తూ తనకు ఓటు వేయాలనుకుంటే వేయాలని, లేదంటే లేదని అన్నారు. అంతేకానీ, సభలో గందరగోళం సృష్టించవద్దన్నారు. తేజస్వీ యాదవ్ 10 లక్షల ఉద్యోగాల హామీని నితీశ్ కొట్టిపడేశారు. పరిణతి, అనుభవం లేనివాళ్లే ఇలాంటి హామీలు ఇస్తారని ఎద్దేవా చేశారు. 
 
ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే అందరికీ ఇవ్వాలని, 10 లక్షల మందికే ఎందుకని ప్రశ్నించారు. జైలు నుంచి కానీ, నకిలీ నోట్లను ముద్రించడం ద్వారా కానీ ఈ పథకానికి తేజస్వీ యాదవ్ డబ్బులు సమకూరుస్తారా? అంటూ నితీశ్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్డీయే కూటమికి షాక్.. అదునుచూసి దెబ్బకొట్టిన జీజేఎం!