Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అంతర్జాల సమానత్వానికి కట్టుబడివున్నాం : రవిశంకర్ ప్రసాద్!

అంతర్జాల సమానత్వానికి కట్టుబడివున్నాం : రవిశంకర్ ప్రసాద్!
, బుధవారం, 22 ఏప్రియల్ 2015 (14:42 IST)
నెట్‌ న్యూట్రాలిటీపై బుధవారం లోక్‌సభలో గందరగోళం నెలకొంది. అంతర్జాల సమానత్వానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు. బుధవారం లోక్‌సభ జీరో అవర్‌లో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన విమర్శలకు ఆయన ధీటుగా సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ వర్గాల ఒత్తిడికి తలవంచిందన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. అంతర్జాల వినియోగంపై ప్రభుత్వం కమిటీ వేసిందని... ట్రాయ్‌ కూడా సంప్రదింపులు జరుపుతోందని రవిశంకర్‌ వెల్లడించారు. నెట్‌ న్యూట్రాలిటీపై చట్టం తీసుకురావాలన్న రాహుల్‌ గాంధీ ప్రతిపాదనకు ఆయన స్పందించలేదు. 
 
2012లో ఎవరెవరి ట్విట్టర్‌ ఖాతాలు నిలిపివేశారో, ఎందుకు నిలిపివేశారో విచారణ జరగాలని అన్నారు. అందరి వాణి వినాలని మేము కోరుకుంటున్నామని, యువతరం, ఇంటర్నెట్‌ భవిష్యత్‌ను మేము సురక్షితంగా ఉంచుతామని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడు మోడీని ప్రశంసించిన మాట రాహుల్‌ ప్రస్తావించారని.... ప్రపంచంలోనే సామాజిక మాధ్యమాల్లో అందరికంటే ఎక్కువ ప్రజాదరణ ఉన్న వ్యక్తుల్లో మోడీ ఒకరని రవిశంకర్ ప్రసాద్ గుర్తు చేశారు. 
 
అంతకుముందు రాహుల్ తొలుత ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వం అంతర్జాలాన్ని కూడా పెద్ద పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. నెట్‌ న్యూట్రాలిటీ కోసం పోరాడేందుకు పది లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారని ఆయన అన్నారు. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లో కూడా చర్చ జరిగిందని రాహుల్‌ గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం ఇంటర్నెట్‌ను కార్పొరేట్లకు ఇచ్చేయాలని అనుకుంటోందని ఆయన ఆరోపించారు. ట్రాయ్‌ సంప్రదింపులను నిలిపివేయాలని కోరుతున్నట్లు ఆయన అన్నారు. చట్టాన్ని మార్చాలని... లేదా కొత్త చట్టాన్ని తీసుకురావాలని ఆయన డిమాండ్‌ చేయగా, దీనికి రవిశంకర్ ప్రసాద్ ధీటుగా సమాధానమిచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu