Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమ్మా నిన్ను చంపేస్తారు : సోనియాకు రాహుల్.. నట్వర్ సింగ్ బాంబు

అమ్మా నిన్ను చంపేస్తారు : సోనియాకు రాహుల్.. నట్వర్ సింగ్ బాంబు
, గురువారం, 31 జులై 2014 (08:52 IST)
అమ్మా.. నీవు ప్రధానమంత్రి పదవి చేపడితే నానమ్మ, నాన్నలను చంపినట్టుగానే చంపేస్తారు. అందువల్ల ఆ పదవి చేపట్టడానికి వీల్లేదంటూ 2004 సంవత్సరంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఆమె తనయుడు రాహుల్ గాంధీ తేల్చిచెప్పడమే కాకుండా, ఆ పదవిని చేపట్టకుండా ఉండేందుకు కొన్ని షరతులు, డెడ్‌లైన్లు విధించినట్టు గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా మెలిగిన భారత మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ తన పుస్తకంలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో ప్రధాని పదవిని ఆత్మప్రభోదానుసారం మేరకు చేపట్టడం లేదని సోనియా గాంధీ ప్రకటించడం కేవలం వట్టి మాటలేనని తేటతెల్లమయ్యాయి. 
 
‘వన్‌ లైఫ్‌ ఈజ్‌ నాట్‌ ఎనఫ్‌' (ఒక జీవితం సరిపోదు) పేరిట నట్వర్‌సింగ్‌ తన స్వీయ చరిత్ర రాశారు. ఇందులో అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు. ఉగ్రవాదులు చంపేస్తారనే భయంతో ప్రధాని పదవి చేపట్టవద్దని రాహుల్ గాంధీ సోనియాపై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. ఆ పుస్తకంలోని ఓ అంశాన్ని నట్వర్ సింగ్ ఓ టీవీ చానెల్‌తో పంచుకున్నారు. ‘అంతర్వాణి' చెప్పినందునే ప్రధాని పదవి స్వీకరించలేదని సోనియా చెప్పడంలో నిజం లేదని, సోనియా ప్రధాని కాకుండా రాహుల్‌ గాంధీయే అడ్డుకున్నారని నట్వర్‌సింగ్‌ తేల్చి చెప్పారు. 
 
2004లో యూపీఏ అధికారంలోకి వచ్చినప్పుడు సోనియా ప్రధాని పదవి స్వీకరించాలనే నిర్ణయానికి వచ్చారు. అంతకుముందు సోనియా విదేశీయతపై వివాదం చెలరేగిన సంగతి కూడా తెలిసిందే. దీనిని కూడా లెక్కచేయకుండా ప్రధాని పదవి స్వీకరించేందుకు సోనియా సిద్ధమయ్యారు. కానీ, ఇందుకు రాహుల్‌ ససేమిరా అన్నారు. ప్రధానమంత్రి అయితే నాన్నమ్మ, నాన్నలాగే సోనియా కూడా చంపే ప్రమాదముందని ఆయన భయపడ్డారు. ‘అమ్మ ప్రధాని కాకుండా... ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా అడ్డుకుంటాను' అని అప్పట్లో రాహుల్‌ అన్నారు. తన నిర్ణయం మార్చుకునేందుకు సోనియాకు ఆయన 24 గంటలు డెడ్‌లైన్‌ కూడా విధించారు. రాహుల్‌ పట్టినపట్టు విడవకపోవడంతో సోనియా గాంధీయే వెనక్కి తగ్గారని తెలిపారు.
 
కాగా, సోనియా, ఆమె కూతురు ప్రియాంక మే 7వ తేదీన తమ ఇంటికి వచ్చారని, ప్రధాని పదవికి సంబంధించిన వివరాలు పుస్తకంలో నుంచి తొలగించాలని కోరారని, గతంలో తన పట్ల వ్యవహరించిన తీరుపట్ల సోనియా విచారం కూడా వ్యక్తం చేశారని, క్షమాపణలు కోరారని నట్వర్‌ పేర్కొన్నారు. ప్రచురితం కావడానికి సోనియా ఇష్టపడని పలు అంశాలు తన పుస్తకం ‘వన్‌ లైఫ్‌ ఈజ్‌ నాట్‌ ఎనఫ్‌'లో ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ పుస్తకం ఆగస్టులో విడుదల కానుంది. ఇందిర నుంచి సోనియా దాకా ‘గాంధీ' కుటుంబానికి నట్వర్‌ సన్నిహితంగా ఉన్నారు. ఆ తర్వాత ఈ బంధం తెగిపోయింది. 
 
ఇరాక్ మాజీ అధ్యక్షుడు దివంగత సద్దాం హుస్సేన్‌ హయాంలో జరిగిన ‘చమురుకు ఆహారం' కుంభకోణంలో నట్వర్‌సింగ్‌తోపాటు ఆయన కుమారుడు కూడా లబ్ధి పొందినట్లు వోల్కర్‌ నివేదిక అప్పట్లో స్పష్టం చేసింది. దీంతో తనకు సంబంధంలేదని నట్వర్‌ చెప్పినా పార్టీ నాయకత్వం పట్టించుకోకుండా 2008లో ఆయనను అవమానకర రీతిలో పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో నట్వర్‌సింగ్‌, ఆయన కుమారుడు జగత్‌ బీఎస్పీలో చేరారు. ప్రస్తుతం నట్వర్‌ కుమారుడు రాజస్థాన్‌లో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. తనను అవమానకరమైన పద్ధతిలో కాంగ్రెస్‌ నుంచి పంపించేశారని నట్వర్‌సింగ్‌ పలు సందర్భాల్లో తన ఆక్రోశం వ్యక్తం చేశారు కూడా. 

Share this Story:

Follow Webdunia telugu