Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముంబైపై దాడి చేస్తాం: ఉగ్రవాదులు హెచ్చరిక!

ముంబైపై దాడి చేస్తాం: ఉగ్రవాదులు హెచ్చరిక!
, సోమవారం, 28 జులై 2014 (12:01 IST)
ఇండియన్ ముజాహిదీన్ సంస్థకు చెందిన ‘ఉగ్రవాదులు' చేతుల్లో మిషన్ గన్లు, బాంబులు ఉంటాయేగానీ... తలలో మైండ్ ఉండదనే విషయం నిరూపితమవుతోంది. ఇందుకు ఉదాహరణగా తీవ్రవాదుల తాజా హెచ్చరికలను నిరూపిస్తున్నాయి. ఇజ్రాయిల్‌లోని గాజాలో అంతర్యుద్ధం జరుగుతున్న సందర్భంగా దాడులు, ప్రతిదాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. 
 
అయితే గాజాకి, ఇండియాకి ఎలాంటి సంబంధం లేకపోయినా, గాజాలో జరుగుతున్న దాడులకు ప్రతీకారంగా ముంబైలో దాడికి పాల్పడతామంటూ ముంబై పోలీసు కమిషనర్ రాకేశ్ మారియాకు బెదిరింపు లేఖ వచ్చింది. ఎక్కడి గాజా, ఎక్కడి ముంబై.. అక్కడ జరుగుతున్న దాడులకు ముంబై మీద ఉగ్రవాద దాడి చేయడమేంటి? ఉగ్రవాదులు పంపారో లేక ఆ పేరుతో వేరే ఎవరైనా పంపారోగానీ, ముజాహిదీన్ పేరుతో ఆ లేఖ ముంబై పోలీసు కమిషనర్‌కి అందింది. దమ్ముంటే మమ్మల్ని ఆపండి అనే హెచ్చరిక కూడా ఆ లేఖలో వుంది. 
 
'1993లో మీకు (మారియా) అవకాశం వచ్చింది. కానీ ఈసారి కుదరదు. దమ్ముంటే మమ్మల్ని ఆపండి’ అంటూ ముజాహిదీన్ అనే సంతకంతో హిందీ, ఆంగ్లంలో పంపిన లేఖలో రాసి ఉంది. దీంతో ముంబైలోని అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేశారు. 1993 నాటి ముంబై పేలుళ్ల కేసును నాడు డీసీపీ హోదాలో మారియా దర్యాప్తు చేశారు. 
 
గాజాలో దాడులకు ప్రతీకారంగా దాడులకు దిగుతామని తనకు అందిన లేఖలో ఉన్నట్లు కమిషనర్ చెప్పారు. దీంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. నగర వ్యాప్తంగా బందోబస్తును కట్టుదిట్టం చేసింది. ముమ్మరంగా తనిఖీలు చేస్తోంది. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఉగ్రవాద నిరోధక శాఖ కూడా హెచ్చరికలను జారీ చేసింది. ఈ నెల 25వ తేదీన రాత్రి ఒక పేజీతో కూడిన బెదిరింపు లేఖ పోలీసు కమిషనర్‌కు అందింది. 

Share this Story:

Follow Webdunia telugu