Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భూ ఆర్డినెన్స్‌ను ఇక ప్రవేశపెట్టేది లేదు.. నరేంద్ర మోడీ

భూ ఆర్డినెన్స్‌ను ఇక ప్రవేశపెట్టేది లేదు.. నరేంద్ర మోడీ
, సోమవారం, 31 ఆగస్టు 2015 (13:14 IST)
వివాదాస్పద భూసేకరణ ఆర్డినెన్స్‌ను ఇకపై మరోమారు తీసుకొచ్చే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు జారీ చేసిన ఈ ఆర్డినెన్స్‌ సోమవారంతో మురిగిపోనుంది. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మూడుసార్లు ఆర్డినెన్స్‌ జారీ చేసినా.. మరోసారి ఆర్డినెన్స్‌ జారీ చేయరాదని ప్రధాని మోడీ నిర్ణయించారు. 
 
ఇదే విషయాన్ని నెలవారీగా ఆయన నిర్వహించే ‘మన్‌ కీ బాత్‌’లో ప్రకటించారు. ఈ ఆర్డినెన్స్‌పై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఆర్డినెన్స్‌ను మళ్లీ జారీ చేయరాదని నిర్ణయించామని, రాజ్యసభలో పెండింగులో ఉన్న ఈ బిల్లులో ఎటువంటి మార్పులు చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నామని ప్రధాని మోడీ ప్రకటించారు. 
 
గ్రామాలు, గ్రామాల్లోని ప్రజలకు లబ్ధి చేకూరేలా 2013లో చేసిన చట్టానికి రాష్ట్ర ప్రభుత్వాలే సవరణలను ప్రతిపాదించాయని, అయినా అనేక సందేహాలను లేవనెత్తారని, రైతుల్లో భయాందోళనలు రేకెత్తించారని ప్రతిపక్షాలను ఉద్దేశించి మోడీ వ్యాఖ్యానించారు. రైతులు భయపడాల్సిన అవసరమే లేదని, అటువంటి పరిస్థితిని తాను ఎవరికీ కల్పించనని చెప్పారు. ఆర్డినెన్స్‌ను ఇక మళ్లీ జారీ చేయడం లేదు కనుక భూ సేకరణకు సంబంధించి తమ ప్రభుత్వం రావడానికి ముందు ఎటువంటి పరిస్థితి ఉందో మళ్లీ అదే కొనసాగుతుందని వివరించారు. 
 
కాగా, యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ సేకరణ చట్టంలో సవరణలు ప్రతిపాదించడమే కాకుండా ఆర్డినెన్స్‌ను మోడీ సర్కారు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, దీనిని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి. లోక్‌సభలో బీజేపీకి బలం ఉండడంతో అక్కడ ఈ బిల్లు ఆమోదం పొందింది. కానీ, రాజ్యసభలో ప్రతిపక్షాలదే పైచేయి కావడంతో అక్కడ పెండింగులో ఉండిపోయింది. ఇప్పటి వరకు మూడుసార్లు ఆర్డినెన్స్‌ జారీ చేసినా పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు.

Share this Story:

Follow Webdunia telugu