తమిళనాడు రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి విజయం సాధించారు. తిరువారూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన మరోమారు విజయభేరీ మోగించారు. కరుణానిధి తమిళనాడు శాసనసభకు ఎన్నిక కావడం ఇది 13వసారి కావడం విశేషం. పోటీచేసిన అన్ని శాసనభ ఎన్నికల్లోనూ విజయం సాధించి కరుణానిధి రికార్డు సృష్టించారు. కరుణానిధికి 1,09,014 ఓట్లు రాగా, అన్నాడీఎంకే అభ్యర్థిగా బరిలోకి దిగిన కుడవాసల్ ఎం రాజేంద్రన్‌కు 58,765 ఓట్లు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి 1263 ఓట్లు వచ్చాయి.
ఇకపోతే.. పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఆయన ఐదోసారి గెలుపొందారు. ఇక్కడ ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత దాదాపు అన్ని రౌండ్లలోనూ కృష్ణారావు ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, ఎన్.ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి తిరుకోటి భైరవస్వామిపై 8,754 ఓట్ల మెజారిటీతో గెలిచారు.