Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శరత్ కుమార్‌కు ఫస్ట్... స్టాలిన్‌కు 16వ వరుస... అలా ఎందుకు కూర్చోబెట్టామంటే.. జయలలిత వివరణ

శరత్ కుమార్‌కు ఫస్ట్... స్టాలిన్‌కు 16వ వరుస... అలా ఎందుకు కూర్చోబెట్టామంటే.. జయలలిత వివరణ
, మంగళవారం, 24 మే 2016 (18:44 IST)
తన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరైన డీఎంకే కోశాధికారి, చెన్నై కొళత్తూరు ఎమ్మెల్యే స్టాలిన్‌ను కార్యక్రమం జరిగిన మద్రాసు వర్శిటీ సెంటినరీ ఆడిటోరియంలోని 16వ వరుస సీటులో కూర్చోబెట్టడం ఇపుడు తమిళనాట పెను చర్చకు దారితీసింది. దీంతో ముఖ్యమంత్రి జయలలిత మంగళవారం వివరణ ఇచ్చారు. ఇదే విషయంపై ఆమె ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. 
 
ఉద్దేశపూర్వకంగా ఎంకే.స్టాలిన్‌ను మధ్య వరుసలో కూర్చోబెట్టలేదని అందులో స్పష్టంచేశారు. ప్రొటోకాల్ ప్రకారం ప్రజాపనుల శాఖ అధికారులు సీట్లు కేటాయించారన్నారు. ఒకవేళ సీటింగ్ ప్లాన్ వల్ల స్టాలిన్‌కు ఇబ్బంది కలిగి ఉంటే, అది ఆయన్ను కానీ, ఆయన పార్టీని కానీ అవమానించాలన్న ఉద్దేశంతో చేసిన పని కాదన్నారు. 
 
పైగా, ఆడిటోరియంలో ముందు వరుసలోని సీట్లు వీఐపీలకు కేటాయించిన సీట్లని తెలిపారు. ప్రమాణస్వీకారోత్సవానికి స్టాలిన్ వస్తున్నారనే విషయం ముందుగానే తమకు తెలిపివున్నట్టయితే, ఆయన హోదాకు తగినట్టుగా సముచిత స్థానం కల్పించాల్సిందిగా అధికారులను కోరివుండేదాన్నని పేర్కొన్నారు. అందువల్ల ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని పేర్కొంటూనే.. స్టాలిన్‌తో పాటు.. డీఎంకే ఎమ్మెల్యేలంతా రాష్ట్ర అభివృద్ధి కోసం సహకరించాలని జయలలిత విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 
 
ఇదే వివాదానికి కారణమిదే! 
నిజానికి గత చరిత్రను పరికిస్తే... డీఎంకే, అన్నాడీఎంకే నేతలు తమ ప్రత్యర్థి పార్టీ నేతల ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన సందర్భాల్లేవు. 2001లో జయ ప్రమాణస్వీకార కార్యక్రమానికి డీఎంకే నాయకుడు స్టాలిన్ చెన్నై మేయర్ హోదాలో హాజరయ్యారు. తదుపరి మళ్లీ మొదటిసారి డీఎంకే నేతలు జయలలిత ప్రమాణం కార్యక్రమానికి ఇపుడు హాజరయ్యారు.
webdunia
 
 
స్టాలిన్‌తో వెంట ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు ఈవీ వేలు, పొన్ముడి, పార్టీ ఎమ్మెల్యేలు శేఖర్‌బాబు, వైగై చంద్రశేఖర్, కెకే. సెల్వం తదితరులు వచ్చారు. అయితే స్టాలిన్‌కు ముందు వరుసలో కాకుండా మధ్యలో ఆడిటోరియంలోని 16వ వరుసలో సీటు కేటాయించారు. అదేసమయంలో ఈ ఎన్నికల్లో ఓడిన అన్నాడీఎంకే భాగస్వామ్య పార్టీ సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు, సినీ నటుడు శరత్ కుమార్‌ను మాత్రం మొదటి వరుస వీఐపీ సీట్లో కూర్చోబెట్టారు. ఇదే వివాదానికి దారి తీసింది. దీనిపై డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి విమర్శలు కురిపించారు. పక్కా ప్లాన్‌తోనే ఈ అవమానం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
డీఎంకే శాసనసభ నేతగా స్టాలిన్ 
ఇదిలావుండగా, డీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎంకే స్టాలిన్ ఎన్నికయ్యారు. దాంతో ఆయన తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా దక్కనుంది. మొత్తం 234 సీట్లు ఉన్న తమిళనాడులో డీఎంకే పార్టీ ఇటీవల ఎన్నికల్లో 89 సీట్లను గెలుచుకుంది. కరుణానిధి వారసుడిగా ఎదుగుతున్న స్టాలిన్ 1996 నుంచి 2002 వరకు చెన్నై మేయర్‌గా కూడా చేశారు. ప్రస్తుతం డీఎంకే పార్టీ కోశాధికారిగా, యూత్ వింగ్ చీఫ్‌గా స్టాలిన్ కొనసాగుతున్నారు. ఈయన చెన్నై, కొళత్తూరు అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించారు.
webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీటు వ్యవహారం.. స్టాలిన్‌కు ''అమ్మ'' థ్యాంక్స్.. వస్తారని తెలిస్తే ముందు వరుసలోనే?!