Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆలయంలో ముస్లిం మహిళకు పురుడు పోసిన హిందూ మహిళా భక్తులు.. చంటిబిడ్డ పేరు గణేశ్

ఆలయంలో ముస్లిం మహిళకు పురుడు పోసిన హిందూ మహిళా భక్తులు.. చంటిబిడ్డ పేరు గణేశ్
, సోమవారం, 5 అక్టోబరు 2015 (15:15 IST)
అత్యంత క్లిష్ట సమయ సందర్భాల్లో కులమతాలకు అతీతంగా ప్రజలు నడుచుకుంటారు. ఇది మరోమారు నిరూపితమైంది. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ ముస్లిం మహిళను ఆటో డ్రైవర్ అర్థాంతరంగా నడిరోడ్డుపై వదిలివేసి వెళ్తే.. దాన్ని చూసిన హిందూ మహిళా భక్తులు ఆ మహిళను ఆలయంలోకి తీసుకెళ్లి పురుడు పోశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని వడాలా అనే ప్రాంతంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
ముంబైకి చెందిన ఇల్యాజ్‌ షేక్‌ అనే వ్యక్తి తన భార్య నూర్ జహాన్‌ను కాన్పు కోసం ట్యాక్సీలో ఆస్పత్రికి తీసుకుని బయలుదేరాడు. మార్గమధ్యంలో ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీన్ని గమనించిన టాక్సీ డ్రైవర్.. తన కారులో ప్రసవించేందుకు వీల్లేదంటూ నిర్ధాక్షిణ్యంగా నిండు గర్భవతి అని కూడా చూడకుండా కిందికి దించేశాడు. దీన్ని పక్కనే ఉన్న గణేశ్ ఆలయంలోని మహిళా భక్తులు గమనించారు. 
 
వెంటనే వారు ఆమెను గుడి ప్రాంగణంలోకి తీసుకెళ్లి అందుబాటులో ఉన్న చీరలు దుప్పట్లతో మరుగు ఏర్పరచి ఆమె ప్రసవానికి సహకరించడంతో నూర్ జహాన్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. వినాయకుడి సమక్షంలో బిడ్డకు జన్మనివ్వడం కంటే అదృష్టం ఏముంటుందంటూ నూర్‌ తన బిడ్డకి గణేశ్‌ అని పేరుపెట్టుకుంది. తర్వాత తల్లీ, బిడ్డలను ఆస్పత్రికి తరలించగా, వారిద్దరు క్షేమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. 
 
దీనిపై ఇల్యాజ్ షేక్ మాట్లాడుతూ ట్యాక్సీ డ్రైవర్ చేసిన పనివల్ల తాము తీవ్రఆందోళనకు గురయ్యాం. నా భార్యకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. ఆ సమయంలో గణేశ్ మందిరం కనిపించడంతో అక్కడే దిగేశాం. ఆ సమయంలో ఆలయంలో కొంతమంది మహిళా భక్తులు కూర్చొనివున్నారు. తమను చూసిన వెంటనే వారంతా పరుగెత్తుకుంటూ వచ్చి.. నా భార్యను ఆలయంలోకి తీసుకెళ్లి ప్రసవం చేసి, నా బిడ్డను చూపించారు. ఇదంతా ఆ దైవ కృపవల్లే జరిగింది. అందుకే తమ బిడ్డకు గణేశ్ అని పేరు పెట్టుకుంటున్నట్టు చెప్పాడు. 

Share this Story:

Follow Webdunia telugu