అదనపు కట్నం కోసం భార్యతో మూత్రం తాగించిన భర్త...
కట్టుకున్న భర్త కాలయముడయ్యాడు. అదనపు కట్నం కోసం చిత్ర హింసలు పెట్టాడు. అంతటితో ఆగని ఆ మృగాడు.. ఏకంగా భార్యతో మూత్రం తాగించాడు. తర్వాత ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించే యత్నం చేశాడు.
కట్టుకున్న భర్త కాలయముడయ్యాడు. అదనపు కట్నం కోసం చిత్ర హింసలు పెట్టాడు. అంతటితో ఆగని ఆ మృగాడు.. ఏకంగా భార్యతో మూత్రం తాగించాడు. తర్వాత ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించే యత్నం చేశాడు. దీంతో ఆ మహిళ బెల్లంకొండ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కానీ, ఆ స్టేషన్ ఎస్.ఐ. ఏకంగా నిందితులకే కొమ్ము కాశాడు. దీంతో మరో గత్యంతరం లేక అర్బన్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ వేధింపులు వెలుగులోకి వచ్చాయి. ఈ వివరాలను పరిశీలిస్తే..
గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం చిట్యాల తండాకు చెందిన యువతికి నగరంలోని లాలాపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఏటుకూరు రోడ్డు చాకలిగుంట ప్రాంతానికి చెందిన యువకుడితో 2007లో వివాహమైంది. రూ.4 లక్షల కట్నం, మూడు సవర్ల బంగారు ఆభరణాలు ఇచ్చారు. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె పుట్టారు. పెళ్ళి అయిన ఏడాది వరకు భార్యను బాగానే చూసుకున్నాడు. నిందితుడు నల్లచెరువు ప్రాంతంలో కిరాణాషాపు నిర్వహిస్తుంటాడు.
కొంతకాలంగా మద్యానికి బానిసై భార్యను వేధించడం ప్రారంభించాడు. చిట్యాల తండా పులిచింతల ముంపు గ్రామం కావడంతో పునరావాసం కింద ప్రభుత్వం బెల్లంకొండ వద్ద ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు మంజూరు చేసింది. అందులో రూ.రెండు లక్షలు ఇవ్వాలంటూ అతడు భార్యను వేధించడం ప్రారంభించాడు.
గత దసరాకు ముందు భార్యను చిత్రహింసలకు గురి చేసి మూత్రం తాగించాడు. అయినప్పటికీ ఆమె పుట్టింటికి వెళ్ళకపోవడంతో ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశాడు. ఇరుగుపొరుగు వారు గమనించడంతో ఆ ప్రయత్నం మానుకున్నాడు. వారు తండ్రికి ఫోన్ చేయడంతో వచ్చి కూతుర్ని తమ వెంట తీసుకెళ్ళి బెల్లంకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో అర్బన్ అదనపు ఎస్పీని కలిసి తన గోడును చెప్పుకుంది. దీంతో కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించారు.