Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వ్యాపం స్కామ్ : మరో కీలక సూత్రధారి అనుమానాస్పద మృతి!

వ్యాపం స్కామ్ : మరో కీలక సూత్రధారి అనుమానాస్పద మృతి!
, సోమవారం, 6 జులై 2015 (09:09 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓ కుదుపుకుదిపిన వ్యాపం (వ్యవసాయక్ పరీక్షా మండల్) స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ప్రధాన సూత్రధారి అనుమానాస్పదస్థితిలో మరణించారు. ఈయన పేరు డాక్టర్ అరుణ్ శర్మ. జబల్‌పూర్‌లోని నేతాజీ సుభాష్‌చంద్రబోస్ మెడికల్ కళాశాలలో డీన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 
 
ఈయన మృతదేహాన్ని ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఉన్న ఓ హోటల్‌ గదిలో ఆదివారం గుర్తించారు. ఈ కుంభకోణం వివరాలు తెలుసుకొనేందుకు ప్రయత్నించిన ఇండియా టుడే గ్రూప్ (ఆజ్‌తక్ టీవీ) జర్నలిస్ట్ అక్షయ్‌సింగ్ మరణించిన మరునాడే డీన్ అరుణ్‌శర్మ చనిపోవడం తీవ్ర సంచలనం సృష్టించింది. కాగా, ఇప్పటివరకు ఈ స్కామ్‌తో సంబంధమున్న 27 మంది అనుమానాస్పదరీతిలో మరణించారని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. 
 
ఇదిలావుండగా, అరుణ్ శర్మపై విషప్రయోగం జరిపినట్టు తెలుస్తోంది. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ 2012 జనవరి ఏడున ఉజ్జయిని జిల్లాలోని రైల్వే ట్రాక్‌పై విగతజీవిగా తేలిన ఝబువాకు చెందిన నర్మతాదామర్ తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్లిన టీవీ జర్నలిస్టు అక్షయ్‌సింగ్ కూడా శనివారం అనుమానాస్పద రీతిలో మరణించారు. నర్మదాదామర్ తల్లిదండ్రులను ఇంటర్వ్యూచేసిన కొన్ని నిమిషాలకే అక్షయ్‌సింగ్ నోటివెంట నురుగులు వచ్చి దవాఖానకు తరలించేలోపే మృతిచెందారు. 
 
ఆయనపై విషప్రయోగం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీన్ అరుణ్‌శర్మ మృతదేహం లభించిన హోటల్ గదిలో కూడా అలాంటి పరిస్థితులే కనిపించాయని పోలీసులు చెప్పారు. ఆయన మరణించేముందు వాంతులు చేసుకున్నారని, మృతదేహం వద్ద ఖాళీ మద్యం సీసా పడి ఉందని ఢిల్లీ పోలీస్ సంయుక్త కమిషనర్ దీపేందర్ పాఠక్ తెలిపారు. గదిలో సేకరించిన ఆధారాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపామని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించామని చెప్పారు. ఆ నివేదికల తర్వాతే మృతికి కారణాలు తెలుస్తాయని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu