దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు వెనుక రెసిడెంట్ డాక్టర్ ఉన్నట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి. దీంతో ఆయన కుటుంబ సభ్యులందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్.ఐ.ఏ కూడా దర్యాప్తు మొదలుపెట్టింది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఫరీదాబాద్ ఉగ్ర కుట్రతో సంబంధాలు ఉన్న డా.ఉమర్ మహ్మద్ ఈ పేలుడులో కీలక వ్యక్తి అని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.
పుల్వామాకు చెందిన ఉమర్ 1989 ఫిబ్రవరిలో జన్మించాడు. అతడి తండ్రి జీహెచ్ నబీ భట్, తల్లి షమీమా బానో. ఉమర్ తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి.. దాదాపు 10 ఏళ్ల క్రితం ఉద్యోగం నుంచి వైదొలిగారు. శ్రీనగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉమర్ ఎంబీబీఎస్, ఎండీ (మెడిసన్) పూర్తి చేశాడు. కొన్నాళ్లు.. జీఎంసీ అనంతనాగ్‌లో సీనియర్ రెసిడెంట్‌గా ఉన్నాడు.
అనంతరం ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. సోషల్ మీడియా వేదికగా తీవ్రవాద భావజాలానికి గురైన డాక్టర్లలో ఉమర్ కూడా ఒకడు. ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో నిర్వహించిన ఉగ్రవాద ఆపరేషన్‌లో పలువురు డాక్టర్లను భద్రతాధికారులు అరెస్టు చేశారు. వారితో ఉమర్‌కు కూడా సంబంధాలు ఉన్నాయని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.
అరెస్టయిన డా.అదిల్‌కు ఉమర్ సన్నిహితుడు అని, గతంలో వీరిద్దరూ అనంత్‌నాగ్‌లో కలిసి పనిచేసినట్లు కనుగొన్నారు. వారి అరెస్టు నేపథ్యంలో భయాందోళనకు గురైన ఉమర్.. ఈ పేలుడుకు పాల్పడినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.
మరోవైపు, ఉమర్ కుటుంబసభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి సోదరులు జహూర్, ఆషిక్ నబీలను కూడా అరెస్టు చేసి విచారిస్తున్నట్లు సమాచారం. శుక్రవారం ఉమర్ తన తల్లికి ఫోన్ చేసి.. లైబ్రరీలో చదువుకోవడంలో బిజీగా ఉన్నందున తనకు ఫోన్ చేయొద్దని పేర్కొన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో తన ఫోన్‌ను కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. పేలుడుకు కారణమైన కారులో ఓ వ్యక్తి శరీర భాగాలను అధికారులు గుర్తించారు.
అయితే అవి, ఉమర్‌వా, కావా అని తెలుసుకునేందుకు అతడి కుటుంబ సభ్యుల నుంచి డీఎన్‌ఏ నమూనాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దిల్లీ పేలుడులో ఉమర్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. వారు తారిఖ్ అహ్మద్ మాలిక్, ఆమిర్ రషీద్, ఉమర్ రషీద్‌గా గుర్తించారు.