Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజ్యాంగం.. ఓ పదం కాదు... భారతీయుల ఐక్యతకు - గౌరవానికి ప్రతీక : మోడీ

రాజ్యాంగం.. ఓ పదం కాదు... భారతీయుల ఐక్యతకు - గౌరవానికి ప్రతీక : మోడీ
, శుక్రవారం, 27 నవంబరు 2015 (18:04 IST)
'రాజ్యాంగం' ఓ పదం కాదనీ, భారతీయుల ఐక్యతకు, గౌరవానికి ప్రతీక అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని లోక్‌సభలో గురు, శుక్రవారాల్లో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ చర్చ ముగింపులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం సాయంత్రం సభను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు.  
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంపై చర్చ కోసం కృషి చేసిన స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు కృతఙ్ఞతలు చెబుతున్నానని, రాజ్యాంగంపై చర్చకు అందరూ ఆసక్తి కనబరిచారన్నారు. ‘ఈ సభలో నేనూ ఒక సభ్యుడిని, ఈ అంశంపై నా ఆలోచనలు ప్రస్తావిస్తా’ అని అన్నారు. రాజ్యాంగం అనేది ఒక సాధారణ పదం కాదని, భారతీయుల ఐక్యతకు, గౌరవానికి ఇది ప్రతీక అని పేర్కొన్నారు. 
 
రాజ్యాంగంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జాతి మొత్తాన్ని ఏకతాటిపై నిలిపే శక్తి ఒక్క రాజ్యాంగానికే ఉందన్నారు. రాజ్యాంగ నిర్మాణం వెనుక మహనీయుల దూరదృష్టిపై చర్చించాము, భారత్ వంటి రాజ్యాంగాన్ని రూపొందించడం అంత తేలికైన విషయం కాదన్నారు. దేశాభివృద్ధికి అన్ని ప్రభుత్వాలు కృషి చేశాయని, భారత దేశ అభివృద్ధిలో ప్రతి ప్రధాని పాత్ర ఉందన్న విషయాన్ని తాను ఎర్రకోటపై నుంచి ఎన్నడో చెప్పానని గుర్తు చేశారు. 
 
అంతేకాకుండా, పుట్టినప్పటి నుంచి చివరిదాకా అవమానాలు ఎదుర్కొన్న బాబా సాహెబ్ అంబేద్కర్ ఆ అవమానాలపై ప్రతీకార భావన లేకుండా జీవించిన మహనీయుడని కొనియాడారు. విషం తాను మింగి భారతీయులకు అమృతాన్ని పంచిన త్యాగపురుషుడాయన అంటూ అంబేద్కర్‌ను పార్లమెంట్‌ సాక్షిగా ప్రధాని మోడీ కొనియాడారు. దేశంలోని అనేక మంది అంబేద్కర్‌ను అడుగడుగునా అవమానించినా ఎక్కడా ప్రతీకార భావన లేకుండా భారత రాజ్యాంగాన్ని అన్ని వర్గాల వారికీ ఆమోదయోగ్యంగా రాశారని మోడీ కీర్తించారు. మోడీ ప్రతిమాటకూ సభ్యులు చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu