దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న భారీ పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులోభాగంగా, కేంద్ర హోం శాఖ ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్.ఐ.ఏకు అప్పగించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
సాధారణంగా ఎన్‌ఐఏ ఉగ్రవాద సంబంధిత కేసులను దర్యాప్తు చేస్తుంది. దీన్ని బట్టి.. ఈ ఘటనను కేంద్రం ఉగ్రచర్యగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై తొలుత ఢిల్లీ పోలీసులు ఉపా చట్టం, ఎక్స్‌ప్లోజివ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఆయా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
అయితే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండుసార్లు సమావేశం నిర్వహించి.. ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులను సమీక్షించారు. పేలుడు ఘటనపై అత్యున్నత దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయని, సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ క్రమంలోనే తాజా నిర్ణయం వెలువడింది. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ప్రధాని నరేంద్ర మోడీ సైతం హెచ్చరించిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఈ కేసులో మృతుల సంఖ్య 13కు పెరిగింది.