Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెళ్లికి ముందే లైంగిక సామర్థ్య పరీక్షలు చేయండి : మద్రాసు హైకోర్టు!

పెళ్లికి ముందే లైంగిక సామర్థ్య పరీక్షలు చేయండి : మద్రాసు హైకోర్టు!
, శుక్రవారం, 29 ఆగస్టు 2014 (11:59 IST)
పెళ్లి చేసుకోబోయే జంటకు వివాహానికి ముందే లైంగిక సామర్థ్య వైద్య పరీక్షలు నిర్వహించాలని మద్రాసు హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే, లైంగిక సామర్థ్యం లేనివారు, సమస్యలు ఉన్నవారు వాటిని దాచిపెట్టి పెళ్లిళ్లు చేసుకుంటే ఎందుకు ప్రశ్నించకూడదని, అలాంటి వారిపై చర్యలెందుకు తీసుకోరని హైకోర్టు నిలదీసింది. వివాహానికి ముందే వైద్య పరీక్షలు నిర్వహిస్తే లైంగిక సామర్థ్యం, వ్యాధుల వంటి వాటిపై అవగాహన కలుగుతుందని వ్యాఖ్యానించింది. సమస్యలను దాయడం ద్వారా మహిళలు నష్టపోయి, బాధితులుగా మిగులుతున్నారని న్యాయస్థానం తెలిపింది. దీనికి సరైన పరిష్కారం వివాహానికి ముందే వైద్య పరీక్షల నిర్వహణ అని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది.
 
నపుంసకుడైన భర్త నుంచి తనకు విడాకులు మంజూరు చేయాలంటూ చెన్నైకు చెందిన ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటీషన్‌పై జస్టీస్ కృపాకరన్ విచారణ జరిపి కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. పెళ్లికి ముందే కాబోయే భార్యాభర్తలకు లైంగి సామర్థ్య పరీక్షలు నిర్వహించే దిశగా కేంద్రం ఆలోచన చేయాలని కేంద్రానికి సూచించారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా చట్టం రూపొందించడమో, సవరణ చేయడమో ఏదో ఒకటి చేయండని సూచించారు. తద్వారా పెళ్ళితో ఒక్కటయ్యే దంపతులు కలకాలం కలిసి జీవించేందుకు బాటలు వేయాలని కోరారు. 
 
అంతేకాకుండా, పెళ్లికి ముందు నపుంసకత్వాన్ని దాచే వారిపై చర్యలెందుకు తీసుకోవడం లేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. నపుంసకత్వాన్ని దాచి పెళ్లి చేసుకునే వ్యక్తి జీవిత భాగస్వామిని మోసం చేసినట్లేని కూడా కృపాకరన్ వ్యాఖ్యానించారు. అందువల్ల పెళ్లికి ముందే లైంగిక సామర్థ్య పరీక్షలు చేయడం వల్ల వారిలో ఉండే నపుంసకత్వంతో పాటు దీర్ఘకాల వ్యాధులు కూడా బయటపడతాయని పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu