Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్‌లో గవర్నర్ గిరి ఉండాల్సిందే : టి సర్కారుకు కేంద్రం లేఖ!

హైదరాబాద్‌లో గవర్నర్ గిరి ఉండాల్సిందే : టి సర్కారుకు కేంద్రం లేఖ!
, గురువారం, 24 జులై 2014 (08:45 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌కు సంబంధించిన శాంతి భద్రతల అధికారాలను గవర్నర్‌కు అప్పగించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ నిర్ణయం తాము తీసుకోలేదని ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోనే ఉందని తేల్చి చెపుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ మరోమారు లేఖ రాసింది. ఇదే సమాచారాన్ని గవర్నర్‌ నరసింహన్‌కు పంపింది. 
 
విభజన చట్టం ప్రకారం వివిధ అంశాలపై గవర్నర్‌కు అధికారాలు అప్పగించాలంటూ కేంద్రం ఇదివరకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బిజినెస్‌ రూల్స్‌లో సవరణలు ప్రతిపాదించింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వ స్పందన కూడా కోరింది. అయితే ఉమ్మడి పోలీసింగ్‌కు తెలంగాణ సర్కారు ససేమిరా అంది. ‘హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని అయినప్పటికీ... అది తెలంగాణలో అంతర్భాగం. ఒక రాష్ట్రం పరిధిలో మరో రాష్ట్ర పోలీసులకు అధికారాలు ఉండవు. శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశం’ అని స్పష్టం చేసింది.
 
శాంతిభద్రతలపై తెలంగాణ కేబినెట్‌ అభిప్రాయం తెలుసుకున్నప్పటికీ, అంతిమ నిర్ణయం మాత్రం గవర్నర్‌దే అని చట్టంలో ఉన్నట్లు కేంద్రం గుర్తు చేయగా... కేబినెట్‌ సలహా మేరకే గవర్నర్‌ నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ సర్కారు పేర్కొంది. గవర్నర్‌కు అధికారాలంటే కేంద్రంపై యుద్ధం చేస్తామని ఇటీవల కేసీఆర్‌ హెచ్చరించారు కూడా. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కృష్ణారావు, రాజీవ్‌ శర్మలతో అనిల్‌ గోస్వామి సమావేశమైనప్పుడు ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. 
 
అపుడు విభజన చట్టానికి అనుగుణంగా గవర్నర్‌ అధికారాలకు సంబంధించి నియమ నిబంధనలు రూపొందించాలని కృష్ణారావు కోరినప్పుడు... ‘ఇది సున్నితమైన అంశం. దీనిపై ఏమీ మాట్లాడలేను’ అని అనిల్‌ గోస్వామి పేర్కొన్నారు. అయితే... మంగళవారం దీనిపై తెలంగాణ సర్కారుకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. చట్టంలోని సెక్షన్‌ 8 కింద గవర్నర్‌కు ఉమ్మడి రాజధానిలో అధికారాలు ఉండాలి. శాంతిభద్రతలు, పోలీసు అధికారుల పోస్టింగ్స్‌కు సంబంధించి గవర్నర్‌ తన అధికారాలను ఉపయోగించాలి అని తెలంగాణ ప్రభుత్వానికీ, గవర్నర్‌కు కేంద్రం నిర్ధేశించింది.

Share this Story:

Follow Webdunia telugu