Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సరిహద్దుల్లో ఆకలితో అలమటిస్తున్న వీర సైనికులు.. దేవుడా రక్షించు నా దేశాన్ని..!

సరిహద్దుల్లో ఆకలితో అలమటిస్తున్న వీర సైనికులు.. దేవుడా రక్షించు నా దేశాన్ని..!
హైదరాబాద్ , మంగళవారం, 10 జనవరి 2017 (05:18 IST)
ఖాళీ కడుపుతో ఎవరూ యుద్ధాలు గెలవలేరన్నది సామెత. కానీ జమ్మూ కాశ్మీరులోని ఇండో-పాక్ సరిహద్దును కావలి కాస్తున్న ఒక బీఎస్ఎఫ్ జవాన్ తమకు నాసిరకం భోజనం పెడుతున్నారని, కొన్ని సార్లు ఆకలితో పస్తులుండాల్సి వస్తోందని చేసిన ఆరోపణ యావద్దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వార్త బయటకు పొక్కిన వెంటనే సరిహద్దు భద్రతాదళాధికారులు విచారణ ప్రారంభించారు. రాజకీయ నాయకుల దేశభక్తి వాచాలత్వపు ముసుగును దాటి ఆ సైనికుడి హాహారావాలను, ఆక్రోశాన్ని గమనిస్తే ఈ దేశ పాలకులు మన వీర సైనికుల ప్రాణాలకు ఎంత విలువ ఇస్తున్నారో అర్థమవుతుంది. 
 
ఒక జాతి రాత్రిపూట ఏమాత్రం భయం లేకుండా ప్రశాంతంగా నిద్రపోతోందంటే, రాత్రింబవళ్లు సరిహద్దులను కావలి కాస్తున్న సైనికులు కారణం. నిత్యం శత్రుదాడులనుంచి తప్పించుకుండా, గుళ్లవర్షాన్ని ఎదుర్కొంటూ, ప్రాణాలను ఫణంగా పెడుతూ.. మంచుకొండల్లో, ఎడారుల్లో, నదీనదాల్లో, గడ్డగట్టించే హిమవత్పర్వత సానువుల్లో వారు మనోవాక్కాయ కర్మేణా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టే 125 కోట్లకు పైగా భారతీయులు ప్రశాంతంగా జీవిస్తున్నారు. కానీ జాతి భవిష్యత్తుకోసం తమ ప్రాణాలనే ఫణంగా పెడుతున్న ఆ వీర సైనికులకే పట్టెడన్నం కరువయిందంటే.. 
 
ఇండో పాక్ సరిహద్దులను కావలి కాస్తున్న ఆ జవాను తమ దుస్థితి గురించి సోషల్ మీడియాలో వరుస వీడియోలను ప్రచురించడంతోమన సైనిక దళాల వాస్తవ పరిస్థితి వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం తమకు సరిపడినంత ఆహారాన్ని పంపిస్తున్నప్పటికీ సీనియర్లు, అధికారులు ఆ ఆహార పదార్థాలను అక్రమంగా మార్కెట్లో అమ్ముకుంటూ సాధారణ సైనికుల కడుపు మాడుస్తున్నారని అతడు ఆ వీడియోల్లో ఆరోపించాడు. 
 
బీఎస్ఎఫ్ 29వ బెటాలియన్‌కు చెందిన టీబీ యాదవ్ అనే ఆ సైనికుడు తనకు ఇస్తున్న ఆహారాన్ని, దాని నాణ్యతా లేమిని కూడా ఆ వీడియోల్లో ప్రదర్శించాడు. 
 
ఉదయం అల్పాహారంగా కేవలం ఒక పరాటాను, టీని మాత్రమే మాకు ఇస్తున్నారు. అందులో కూడా ఊరగాయ కానీ, కూరగాయలు కాని ఉండవు. మేం 11 గంటలపాటు డ్యూటీ చేయవలసి వస్తుంది. ఒక్కోసారి డ్యూటీ సమయం పొడవునా మేం నిలబడే ఉండాల్సి వస్తుంది. ఇక భోజనం సమయంలో మాకు కాస్త పసుపు, కాస్త ఉప్పు కలిపిన పప్పుకూరను రోటీతో కలిపి ఇస్తారు. సరిహద్దుల్లో మాకు ఇస్తున్న ఆహారం ఇదే. ఇలాంటి పరిస్థితుల్లో ఒక జవాన్ తన డ్యూటీని ఎలా చేయగలడు? మా దుస్థితిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ విషయంపై విచారించాలని ప్రధాని మోదీని అభ్యర్థిస్తున్నాను. 
 
సరిహద్దుల్లో సైనికుల దుస్థితి గురించి బయటి ప్రపంచానికి తెలిపినందుకు గాను నన్ను ఇకపై ఇక్కడ ఉంచకపోవచ్చు. నాపై చర్య కూడా తీసుకోవచ్చు అంటూ విచారం వ్యక్తం చేసిన ఆ సైనికుడు ఈ విషయాన్ని ప్రజలు ఆలోచించాలని, దిద్దుబాటు చర్యలు చేపట్టాలని అభ్యర్థించాడు. కొన్ని సార్లు ఖాళీ కడుపుతోనే తాము నిద్రపోవలసి వస్తోందని అతడు ఆరోపించాడు. ఈ వార్త బయటకు పొక్కిన వెంటనే బీఎస్ఎఫ్ దీనిపై విచారణ చేస్తామని పేర్కొంది. 
 
విషయం తెలియగానే... హోంమంత్రి రాజనాథ్ సింగ్ తనకు ఈ విషయంపై నివేదిక పంపాలని బీఎస్ఎఫ్ అధికారులను ఆదేశించారు. తక్షణం నివేదిక రూపొందించడమే కాకుండా తగిన చర్య తీసుకోవాలని చెప్పినట్లుగా హోంమంత్రి ట్వీట్ చేశారు.
 
ఆకలికి అలమటిస్తూ సరిహద్దులను కాపలా కాస్తున్న ఆ వీర సైనికుడి ఆక్రోశాన్ని ఏ పాలకుడు తీర్చగలడు? ఏ అధికారి పట్టించుకోగలడు? నాలుగు నిమిషాల నిడివి కలిగిన  మూడు విభిన్న వీడియోల ద్వారా అతడు చూపించిన వాస్తవ పరిస్థితి సగటు భారతీయులను ద్రవింపచేస్తోంది. సైన్యంలో అవినీతి లేదని, దేశంలో ఏ రంగంలోనూ లేని నిజాయితీకి సైన్యం ప్రతీక అని గప్పాలు చెప్పుకుంటున్న దొడ్డమనుషులు  మన సైనికుల ఆకలికేకలను ఇప్పుడయినా వినగలరా? 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కృష్ణా జలాలపై తెలంగాణ వాదన చెల్లదన్న సుప్రీంకోర్టు