Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సెప్టెంబరుకు పార్లమెంట్ సమావేశాలు వాయిదా

సెప్టెంబరుకు పార్లమెంట్ సమావేశాలు వాయిదా
, మంగళవారం, 5 ఆగస్టు 2008 (17:45 IST)
సెప్టెంబరు రెండో వారంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వాయలార్ రవి మంగళవారం తెలిపారు. ముందుగా అనుకున్నట్టు ఈ నెల (ఆగస్టు) 11న నుంచి ఈ సమావేశాలు జరగాల్సి ఉండగా, దేశంలో ఇటీవల బాంబు పేలుళ్లు జరిగిన ప్రాంతాల్లో, జమ్మూకాశ్మీర్‌లో ప్రశాంత వాతావరణం నెలకొన్న తర్వాతే ఈ సమావేశాలను ప్రారంభించాలని తీర్మానించినట్లు రవి వెల్లడించారు.

ఇదిలా ఉండగా, జూలై నెలలో రెండు రోజుల పాటు పార్లమెంట్ సమావేశమైన సంగతి తెలిసిందే. యూపీఏ ప్రభుత్వానికి లెఫ్ట్ పార్టీలు మద్దతును ఉపసంహరించుకున్న తరుణంలో ఏర్పాటైన ఈ సమావేశంలో అణుఒప్పందం, యూపీఏ మెజారిటీ అంశాలపై చర్చలు జరిగాయి. రెండో రోజైన జూలై 22న యూపీఏ ప్రభుత్వానికి విశ్వాస పరీక్ష జరిగింది.

విశ్వాస పరీక్షల్లో భాగంగా యూపీఏ సర్కారు డబ్బు కట్టలను ప్రయోగించి విశ్వాస పరీక్షల్లో నెగ్గేందుకు ప్రయత్నించిందని బీజేపీ నాయకులు ముడుపులను పార్లమెంటులోనే ప్రదర్శించి ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనితో పెనుదుమారం రేపిన ఈ వివాదంపై ఏడుగురితో కూడిన బృందం ముగ్గురు బీజేపీ ఎంపీల వద్ద విచారణ జరిపింది.

దీనికి సంబంధించిన నివేదికను ఆగస్టు 11 తేదీలోపు సమర్పించాలని గడువు విధించబడింది. అయితే ఈ గడువును పొడిగించాల్సిందిగా బృందం కోరుతున్నట్లు రవి చెప్పారు. ఇకపోతే కాంగ్రెస్ ఎంపీ కిషోర్ చంద్ర దేవ్, లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీలు ఇప్పటికే వీడియో, ఆడియో టేప్‌లను వీక్షించారని రవి పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu