Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మా శక్తి మీకు.. మీ శక్తి మాకు: ఒబామా - మన్మోహన్

మా శక్తి మీకు.. మీ శక్తి మాకు: ఒబామా - మన్మోహన్
PTI
ఒబామా పర్యటనలో కీలకఘట్టమైన ద్వైపాక్షిక చర్చలు సోమవారం మధ్యాహ్నం ముగిసాయి. అనంతరం ఒబామా - మన్మోహన్ ఇరువురు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ నుంచి సంయుక్తంగా మీడియా సమావేశంలో ప్రసంగించారు.

భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకు వెళుతోందనీ, ఇక్కడి వనరులకు తమ సాంకేతి పరిజ్ఞానం తోడైతే ఇరు దేశాలకు మరింత లబ్ధి చేకూరుతుందని ఒబామా వెల్లడించారు. అమెరికా సాంకేతక పరిజ్ఞానం మనకు తోడ్పడితే మరింత వృద్ధిని సాధించవచ్చని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్నారు.

మీడియా సమావేశంలో ముందుగా మాట్లాడిన ప్రధానమంత్రి... భారతదేశానికి తొలిసారిగా పర్యటనకు వచ్చిన ఒబామా తనకు మంచి స్నేహితుడని, గొప్ప నాయకుడని కొనియాడారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చల అంశమై పరస్పరం లోతుగా చర్చించుకున్నామన్నారు.

అమెరికాతో భారతదేశం వాణిజ్య, అణు, రక్షణ రంగాల్లో పరస్పరం సహకరించుకుంటాయన్నారు. భారతదేశం నుంచి ఎగుమతులు గణనీయంగా పెరిగాయనీ, 21వ శతాబ్దంలో సమాన హోదా కలిగిన భాగస్వామ్య దేశాలుగా కలిసి పని చేస్తామనీ అన్నారు.

అణ్వాయుధాల నిరోధం, ప్రపంచశాంతికై భారత్ - అమెరికాలు కృషి చేస్తాయన్నారు. శాంతియుత అణుసహకారంతో ఇరు దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాయనీ, తీవ్రవాదాన్ని అరికట్టడంలో రెండు దేశాలు కలిసి పనిచేస్తాయని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వెల్లడించారు.

అనంతరం అమెరికా అధ్యక్షుడు ఒబామా మాట్లాడుతూ... భారతదేశం - అమెరికా మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోయేందుకు అనువైన పరిస్థితులను కల్పించేందుకే తాను భారతదేశ పర్యటనకు వచ్చినట్లు చెప్పారు. ఇందులో భాగంగా తాను భారతప్రధాని మన్మోహన్ సింగ్ తో సుదీర్ఘంగా చర్చించానన్నారు.

ముఖ్యంగా పర్యావరణ అనుకూల విద్యుదుత్పత్తి సాంకేతిక పరిజ్ఞానంపై ఇరు దేశాల సహకారం ఎంతో అవసరం ఉందని గుర్తించామన్నారు. రెండు అతిపెద్ద ప్రజాస్వామ్యాల మధ్య సంబంధాలు మరింత అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు.

హరిత విప్లవానికి ఇరు దేశాల మధ్య సహాయ సహకారాలుంటాయనీ, వ్యవసాయ రంగంలో ఆహారభద్రత, సాంకేతిక పరిజ్ఞానంపై ఇరు దేశాలు కలిసి పని చేస్తాయని ఒబామా చెప్పారు.

ఉగ్రవాద కార్యకలాపాలపై స్పందిస్తూ... అణ్వాయుధ వ్యాప్తి నిరోధానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని ప్రకటించారు. ఆసియాలో ఎక్కడా ఉగ్రవాద మూలాలు లేకుండా చూడాలని రెండు దేశాలు కోరుకుంటున్నాయని తెలిపారు. కాశ్మీరు అంశంపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ... కాశ్మీర్ సమస్య పరిష్కారానికై భారతదేశం - పాకిస్తాన్ ఓ ఒప్పందానికి రావలసి ఉందని అభిప్రాయపడ్డారు.

అదేసమయంలో కాశ్మీరు పరిష్కారానికి అమెరికా ఒత్తిడి తెస్తుందన్న వాదనలో నిజం లేదన్నారు. ముఖ్యంగా భారత్ - పాక్‌లు విశ్వాస కల్పనా చర్యలు ముమ్మరం చేయాల్సి ఉందన్నారు. శాంతికోసం భారత ప్రధాని చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని కితాబిచ్చారు.

పాకిస్తాన్‌తో ఉన్న సమస్యలపై ప్రధానమంత్రి మాట్లాడుతూ... పాకిస్తాన్‌తో ఉన్న అన్ని అపరిష్కృత సమస్యలను పరిష్కరించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే తీవ్రవాదంపై పాకిస్తాన్ పూర్తిస్థాయి చర్యలు తీసుకోవాలని చెప్పారు. శాంతియుత, బలమైన పాకిస్తాన్‌ను భారతదేశం కోరుకుంటోందని పేర్కొన్నారు.

కాశ్మీరు సమస్యపై భారత్ శాంతియుత పరిష్కారాన్ని కోరుకుంటోందనీ, అయితే పాక్ ఉగ్రవాదానికి సహకారాన్ని నిలిపివేసేంతవరకూ చర్చల్లో పురోగతి ఉండదని తేల్చి చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu