Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీఎస్-గాలిల మధ్య రాజీ: కర్ణాటక సంక్షోభానికి తెర!

బీఎస్-గాలిల మధ్య రాజీ: కర్ణాటక సంక్షోభానికి తెర!
, ఆదివారం, 8 నవంబరు 2009 (17:36 IST)
ఎట్టకేలకు కర్ణాటక రాజకీయ సంక్షోభానికి తెరపడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, అసమ్మతి నేత గాలి జనార్ధన్ రెడ్డిల మధ్య తలెత్తిన విభేదాలు పరిష్కారమయ్యాయి. వీరిద్దరు ఒకేచోట సమావేశమై మనస్సువిప్పి మాట్లాడుకున్నారు. ఇందుకు భారతీయ జనతా పార్టీ సీనియర్ మహిళా నేత సుష్మా స్వరాజ్ నివాసం వేదికగా నిలించింది.

అలాగే, ఆ పార్టీ అగ్రనేతలు, అరుణ్ జైట్లీ, అనంతకుమార్, వెంకయ్య నాయుడు సమక్షంలో యడ్యూరప్ప, గాలి జనార్ధన్ రెడ్డిల మధ్య రాజీ ఒప్పందం కుదరింది. వీరందరి మధ్య ఆదివారం సుష్మా స్వరాజ్ అధ్యక్షతన జరిగిన చర్చలు ఫలించాయి. ఆ తర్వాత వారంతా మీడియా ముందుకు వచ్చిన కర్ణాటక రాజకీయ సంక్షోభం ముగిసిందని ప్రకటించారు.

పార్టీ, రాష్ట్ర, కన్నడ వాసుల సంక్షేమం కోసం కలిసి పని చేస్తామని వారిద్దరూ మీడియా ముందు వెల్లడించారు. అనంతరం యడ్యూరప్ప, జనార్ధన్‌ రెడ్డిలు విజయ సంకేత సూచకంగా చేతులు పైకెత్తి మీడియాకు ఫోజులు ఇచ్చారు.

ఇదిలావుండగా, వీరిరువురు మధ్య రాజీ ఒప్పందం ఏర్పడటానికి ముఖ్యమంత్రి యడ్యూరప్ప కొన్ని షరతులు విధించినట్టు సమాచారం. ఆ పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ, అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో కుదిరిన ఈ ఒప్పందంలో ప్రస్తుత మంత్రివర్గంలోని నలుగురు మంత్రులను తొలగించేందుకు సీఎం సమ్మతించినట్టు ఆ పార్టీ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది.

కర్ణాటకలో గత 13 రోజులుగా రాజకీయ సంక్షోభం ఉత్పన్నమైన విషయం తెల్సిందే. వరద బాధితులకు గాలి సోదరులు చేపట్టిన ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి అనుమతి ఇవ్వక పోవడంతో ఉత్తర కర్ణాటకను శాసిస్తూ మైనింగ్ అధిపతులైన రాష్ట్ర మంత్రులు గాలి జనార్ధన్ రెడ్డి, గాలి కరుణాకర్ రెడ్డిలు తిరుగుబాటు బావుటా ఎగురవేసి అధిష్టానానికి సవాల్ విసిరిన విషయం తెల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu