Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'నయనాదేవి' ఆలయంలో మృత్యుఘోష

'నయనాదేవి' ఆలయంలో మృత్యుఘోష
FileFILE
హిమాచల్‌ప్రదేశ్‌లోని నయనాదేవి ఆలయ రహదారి మృత్యుమార్గమైంది. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన ఈ పుణ్యక్షేత్రం మృత్యుఘోషకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. తనను ఇష్టదైవంగా భావించే భక్తుల ప్రాణాలను నయనా దేవి నైవేద్యంగా స్వీకరించింది. ఒకరు ఇద్దరు కాదు.. ఏకంగా.. 146 మంది భక్తులు అమ్మవారి పాదాల చెంత అశువులు బాశారు. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేందుకు తమ వెంట తెచ్చుకున్న పూజా సామగ్రిని విడవకుండానే పలువురు మహిళలు తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. భక్తి మార్గంలో ప్రయాణిస్తూ అసువులు బాసిన పురుషులు మరికొందరు కాగా, అభంశుభం తెలియని మరో 36 మంది చిన్నారులు సైతం ఉన్నారు.

తొక్కిసలాటలో.. పద ఘట్టనలతో వారి శరీరాలు నలిగిపోయాయి. భక్తుల దుస్తులు బురద కొట్టుకుని మసకబారిపోయాయి. చలిని కాచుకునేందుకు తెచ్చుకున్న స్వెట్టర్లు మృతదేహాలను కప్పేందుకు పనికి ఉపయోగపడ్డాయి. ఈ పరిస్థితి నుంచి తేరుకుని ప్రాణాపాయం నుంచి బయటపడిన మరికొందరు భక్తులు చేసిన రోదనలు, ఆర్తనాదాలతో నయనా దేవి కొండ ప్రతిధ్వనించింది. చల్లటి హిమాచల కొండశిఖరం వెచ్చని కన్నీళ్లతో తడిసింది ముద్దయింది.

ఆదివారం జరిగిన తొక్కిసలాటలో 146 మంది ప్రాణాలు కోల్పోయారు. కొండ చరియలు విరిగి పడుతున్నాయంటూ అగంతుకులు చేసిన కేకలతో ఒక్కసారి తొక్కిసలాట జరిగింది. మృతుల్లో 36 మంది చిన్న పిల్లలు. 38 మంది మహిళలు ఉన్నారు. మరో 40 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది పంజాబ్ రాష్ట్రానికి చెందిన భక్తులే ఉన్నారు.

శ్రావణ నవరాత్రులు ప్రారంభమయ్యాయి. అదీ.. శ్రావణ తొలి ఆదివారం కావడంతో అశేష భక్తులు నయనా దేవి దర్శనానికి తరలి వచ్చారు. ఈ నవరాత్రులు వచ్చే 11వ తేదీతో ముగుస్తాయి. అయితే.. తొలి ఆదివారం కావడంతో దాదాపు పాతిక వేల మంది భక్తులు తరలి వచ్చారు. కొండ కిందిభాగం నుంచి.. పై భాగం వరకు వంకరు టింకరులుగా భారీ క్యూ. చల్లటి వాతావరణం.. చిన్నారుల కేరింతలు.. పెద్దల ఆనందోత్సాలతో ఆ ఆలయ మార్గం ఒకటే సందడి.

ఇంతలో కొండ చెరియలు విరిగి పడుతున్నాయని ఎవరో ఒక అగంతుకుడు కేక వేశాడు. ఇది వదంతా? వాస్తవమా? నిర్ధారించుకునే లోపే కళ్లముందు పెను ఘోరం జరిగిపోయింది. జనం అటూ ఇటూ పరుగులు తీశారు. కిందికి దిగుతున్నవాళ్లు, పైకి ఎక్కుతున్న వాళ్ల మధ్య తొక్కిసలాట మొదలైంది. లేని ప్రమాదం నుంచి బయటపడేందుకు ఎవరికి వారు ప్రయత్నించారు. ఒక్కసారిగా ఒత్తిడి పెరగడంతో రెయిలింగ్‌ విరిగిపోయింది. తొక్కిసలాట మరింత ఎక్కువైంది. కింద పడిన వారు మళ్లీ పైకి లేవలేకపోయారు. కేవలం 20 నిమిషాల్లో 146 మంది ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి.

webdunia
FileFILE
ఆ తర్వాత చూస్తే... అక్కడ దారి పొడవునా శవాలు. తమ పిల్లల కోసం, ఆత్మీయుల కోసం రోదిస్తూ వెతుకున్న వారు. అప్పటిదాకా భక్తిభావంతో నిండిన వాతావరణం ఒక్కసారి హృదయవిదారకంగా మారింది. వెంటనే స్పందించిన ఆలయ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వం ఆస్పత్రులకు తరిలించారు. వీరిలో కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

ఇదిలావుండగా, మృతుల కుటుంబాలకు హిమాచల్‌ ప్రభుత్వం రూ.లక్ష చొప్పున పరిహారం ప్రకటించింది. హిమాచల్‌ ముఖ్యమంత్రి ప్రేమ్‌కుమార్‌ ధుమాల్‌ ఘోరకలిపై స్పందిస్తూ... బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని తెలిపారు. పంజాబ్ ప్రభుత్వం కూడా తక్షణం స్పందించింది. మృతుల్లో ఎక్కువ మంది పంజాబీలే కావడంతో ఆ రాష్ట్రమంత్రులు ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలు పర్వవేక్షిస్తున్నారు.

ఆలయ ప్రత్యేకత
నయనాదేవి ఆలయం దేశంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఆ ఆలయం వెనుక పురాణగాథ ఉంది. దక్షయజ్ఞంలో తన భర్త పరమేశ్వరుడికి జరిగిన అవమానాన్ని భరించలేక సతి ఆత్మాహుతి చేసుకుంటుంది. ఆగ్రహం, ఆవేదన భరించలేని శివుడు సతి మృతదేహంతో తాండవం చేస్తాడు. శివుడి కోపాగ్ని నుంచి భూమిని కాపాడేందుకు... విష్ణుమూర్తి తన చక్రంతో సతి భౌతిక కాయాన్ని ముక్కలుగా చేస్తాడు. ఒక్కో ముక్క ఒక్కోచోట పడుతుంది. అవన్నీ శక్తి పీఠాలుగా మారతాయి. సతి కళ్లు పడటంవల్లే ఇక్కడి దేవికి ‘నయనా దేవి’ అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది.

Share this Story:

Follow Webdunia telugu