Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తుపాకి నీడలో అభివృద్ధి అసాధ్యం: మన్మోహన్ సింగ్

తుపాకి నీడలో అభివృద్ధి అసాధ్యం: మన్మోహన్ సింగ్
, గురువారం, 5 నవంబరు 2009 (09:17 IST)
దేశంలోని ఏ ప్రాంతమైన తుపాకీ నీడలో అభివృద్ధికి నోచుకోలేదని ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని నక్సలైట్లు గ్రహించి అడవి పుత్రుల అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. గిరిజనాభివృద్ధిపై రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రులతో ప్రధాని బుధవారం సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం కోసం గడిచిన నాలుగు దశాబ్దాలుగా సాయుధ పోరాటం సాగిస్తున్న నక్సలైట్లు ఆయుధాల నీడలో అడవిపుత్రల అభివృద్ధి సాధ్యం కాదన్న వాస్తవాన్ని ఇప్పటికైనా గ్రహించాలని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ సూచించారు. తుపాకీ నీడలో సమగ్ర గిరిజనాభివృద్ధి సాధ్యం కాదని ఆయన నక్సలైట్లను హెచ్చరించారు.

త్వరలోనే జాతీయ గిరిజన విధానాన్ని ప్రకటించనున్నట్టు ఆయన తెలియజేశారు. దశాబ్దాలుగా దోపిడీకి గురవుతున్న గిరిజనుల సాంఘిక, ఆర్థికాభివృద్ధికి నోచుకునేలా ప్రభుత్వాల చర్యలు ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎంతో క్లిష్టమైనవని, అందువల్ల వాటి పరిష్కారానికి ప్రభుత్వాలు చాకచక్యంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

అలాగే, గిరిజనులు స్వశక్తి మీద ఆధారపడి జీవించేందుకు వీలు కల్పించాలన్నారు. గిరిజనులు అంతటాఒకే తీరులో లేరని గుర్తు చేశారు. వారి సంస్కృతి, భాష, యాస, కట్టు, బొట్టు, జుట్టు ఇత్యాది ఆచార వ్యవహారాలు వేర్వేరుగా ఉన్నాయని, వీటిపై వారికి ఎనలేని మక్కువ, ప్రేమానురాగాలు చూపుతారన్నారు.

ఇలాంటి వారిని జాతీయ జీవన స్రవంతిలోకి తీసుకుని రావడానికి సరైన వైఖరిని అనుసరించాలని కోరారు. ముఖ్యంగా, గిరిజనుల సేకరించే అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా చేసి, వారిలో స్వయంపోషకత్వాన్ని పెంచాలని ప్రధాని మన్మోహన్ విజ్ఞప్తి చేశారు.

Share this Story:

Follow Webdunia telugu