Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుజరాత్‌లో 73కు పెరిగిన కల్తీ మద్యం మృతులు

గుజరాత్‌లో 73కు పెరిగిన కల్తీ మద్యం మృతులు
, గురువారం, 9 జులై 2009 (15:47 IST)
గుజరాత్‌ రాష్ట్రంలోని నరేంద్ర మోడీ సర్కారు చిక్కుల్లో పడింది. కల్తీ మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య గురువారానికి 73కు చేరుకుంది. దీనిపై విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపిస్తున్నాయి.

కాగా, కల్తీ మద్యం సేవించి వివిధ ఆస్పత్రుల పాలైన వారిలో బుధవారం రాత్రే 25 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 65గా ఉందని చెపుతుండగా, స్థానిక మీడియా మాత్రం 73గా ఉందని పేర్కొంటోంది.

అహ్మదాబాద్‌ నగరంలోని ఒధవ్, అమ్రైవాడి, రాయ్‌పూర్, రఖియాల్ తదితర ప్రాంతాలకు చెందిన కల్తీ మద్యం బాధితులు ఇంకా ఆస్పత్రులకు వచ్చి చేరుతూనే ఉన్నారు. బాధిత కుటుంబాలకు చెందిన ప్రజలు రోడ్లపైకి వచ్చి దుకాణాలను మూయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కల్తీ మద్యం తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

అంతటితో శాంతించని బాధిత కుటుంబాల ప్రజలు పోలీసులపై రాళ్లు రువ్వుతున్నారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మొహరిస్తున్నారు. దీనిపై జాయింట్ పోలీసు కమిషనర్ జీకే.పర్మార్ మాట్లాడుతూ.. ఒధవ్‌లో పరిస్థితి అదుపులో ఉందన్నారు. ఈ సంఘటనకు సంబంధించి 11 మందిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. అయితే, ఆందోళనకారులు రాళ్లు రువ్వడం వల్ల ఒక ఏఎస్ఐకు గాయపడ్డారని తెలిపారు.

ఇదిలావుండగా, ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తున్న విమర్శలకు తలొగ్గిన మోడీ సర్కారు ఇప్పటికే ఇద్దరు డిప్యూటీ ర్యాంకు ఎస్పీలతో సహా ఆరుగురు పోలీసు అధికారులపై బదిలీ వేటు చేసింది. దీనిపై హైకోర్టు మాజీ న్యాయమూర్తి కమల్ మెహతా నేతృత్వంలో విచారణ కమిషన్‌ను కూడా భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాగా, గత 1960 నుంచి గుజరాత్‌లో సారా విక్రయాలను పూర్తిగా నిషేధించారు.

Share this Story:

Follow Webdunia telugu