Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉగ్రవాదంపై కలిసిపోరాడుతాం: బరాక్ ఒబామా

ఉగ్రవాదంపై కలిసిపోరాడుతాం: బరాక్ ఒబామా
ఉగ్రవాద నిర్మూలనకు భారత్‌తో కలిసి పోరాడుతామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వెల్లడించారు. భారత్-అమెరికా స్నేహబంధాలను పెంపొందించడానికే తాను భారత్ పర్యటన చేపట్టినట్లు బరాక్ ఒబామా సోమవారం రాష్ట్రపతి భవన్‌లో పేర్కొన్నారు.

ముంబై దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత్ ఇప్పుడు బలమైన శక్తిగా ఎదిగిందని ఒబామా కితాబిచ్చారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం ఇచ్చిన ఆతిథ్యానికి ఒబామా కృతజ్ఞతలు తెలియజేశారు.

అంతకుముందు అమెరికా అధ్యక్షుడు ఒబామా సోమవారం ఉదయం రాష్టప్రతి భవన్ చేరుకున్నారు. రాష్టప్రతి ప్రతిభాపాటిల్, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ దంపతులు, పలువురు మంత్రులు సంప్రదాయబద్ధంగా ఒబామా దంపతులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం బరాక్ ఒబామా త్రివిధ దళాలు గౌరవ వందనాన్ని స్వీకరించారు.

రాష్ట్రపతి భవన్ నుంచి రాజ్‌ఘాట్‌కు చేరుకున్న బరాక్ ఒబామా దంపతులు జాతిపిత మహాత్మాగాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు. రాజ్‌ ఘాట్‌ను సందర్శించిన ఒబామా గాంధీజీని స్మరించుకున్నారు.

ఇకపోతే.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మన పార్లమెంట్‌లో సోమవారం కేవలం 20 నిమిషాలే ప్రసంగించనున్నారు. ఒబామా పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ప్రసంగించనున్న సంగతి తెలిసిందే. సోమవారం సాయంత్రం 5.25 గంటలకు పార్లమెంట్‌కు చేరుకునే ఒబామా, 5.38 గంటలకు ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. అయితే, ఆయన ప్రసంగం 18-20 నిమిషాలే ఉంటుందని పార్లమెంట్ వర్గాలు తెలిపాయి.

ఒబామా ప్రసంగం నిమిత్తం మొదటిసారిగా పార్లమెంట్‌లో టెలీప్రామ్‌టర్‌ను వినియోగిస్తున్నారు. ఒబామాకు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్, లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పవన్‌కుమార్ బన్సాల్‌లు స్వాగతం పలుకుతారు. ముందుగా హమీద్ అన్సారీ స్వాగతోపన్యాసం చేస్తారు.

మీరాకుమార్ వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెబుతారు. మరోవైపు పార్లమెంట్‌లో ఒబామా ప్రసంగం సందర్భంగా ఎంపీలంతా గౌరవప్రదంగా ప్రవర్తించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కోరింది.

Share this Story:

Follow Webdunia telugu