Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సరస్సుల నగరం ఉదయ్‌పూర్

సరస్సుల నగరం ఉదయ్‌పూర్
, శుక్రవారం, 23 మే 2008 (18:43 IST)
రాజస్థాన్‌లో సరస్సుల నగరం ఉదయ్‌పూర్. వివిధ రకాల చిత్ర, చేతివృత్తుల కళలకు నిలయం ఉదయ్‌పూర్. మేవార్ వంశస్తుల కొత్త రాజధాని ఉదయ్‌పూర్. దక్షిణ రాజస్థాన్ ప్రాంతంలో ప్రముఖ పర్యాటక ప్రాంతం ఉదయ్‌పూర్. ఉదయ్‌పూర్ నగరాన్ని రెండో మహారాణా ఉదయ్ సింగ్ 1568వ సంవత్సరంలో కట్టించాడు.

మేవార్ వంశస్తుల తొలి రాజధాని చిత్తోర్‌ఘర్‌ను మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆక్రమించుకోవటంతో కొత్త నగర నిర్మాణానికి ఉదయ్ సింగ్ చర్యలు చేపట్టాడు.

స్థానిక పిచోలా సరస్సు సమీపంలో నగరాన్ని నిర్మిస్తే బావుంటుందని ఉదయ్ సింగ్ ఆలోచించాడు. ఒకవైపున ఆరావళీ పర్వతాలు, మరోవైపు పచ్చని అడవుల మధ్య నిర్మించే కొత్త నగరం చిత్తోర్‌ఘర్ కంటే సురక్షితమైనదిగా ఉదయ్ సింగ్ భావంచి పనులు చేపట్టాడు.

మహారాణా ఉదయ్ సింగ్ 1572వ సంవత్సరంలో చనిపోయినప్పటికీ ఆయన కుమారుడు మహారాణా ప్రతాప్ ఈ పనిని పూర్తిచేశాడు. మొఘలులకు ఉదయ్‌పూర్ వశం కాకుండా ప్రతాప్ పోరాడిన తీరు అనిర్వచనీయం.

హాల్దీఘాటీ వద్ద 1576లో జరిగిన యుద్ధంలో మొఘలులతో పోరాడుతూ రాజపుట్ రత్నం మహారాణా ప్రతాప్ ప్రాణాలు విడిచాడు. ఆ తర్వాత కాలంలో జరిగిన మార్పులకు అనుగుణంగా ఉదయ్‌పూర్ చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోయింది.

చూడవలసిన ప్రాంతాలు

సిటీ ప్యాలెస్
ఆరావళీ పర్వతంపై వాస్తకళ ఉట్టిపడే విధంగా నిర్మించిన భవంతి సిటీ ప్యాలెస్. భవంతి లోపల అతిపెద్ద వసారా, విశాలమైన గదులు, బాల్కనీలు, ఉన్నాయి. భవంతి బయట అందమైన పూల తోటలను ఏర్పాటుచేశారు.

జగదీష్ దేవాలయం
మహారాణా జగత్ సింగ్ 1651వ సంవత్సరంలో జగదీష్ దేవాలయాన్ని నిర్మించాడు. భారత-ఆర్య వాస్తుశైలిని అనుసరించి ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఉదయ్‌పూర్‌లో అందమైన దేవాలయాల్లో జగదీష్ టెంపుల్ ఒకటి.

మహారాణా ప్రతాప్ స్మారకం
మేవార్ వంశానికే వన్నెతెచ్చిన రాజు మహారాణా ప్రతాప్ సింగ్. ముత్యాల పర్వతంగా పిలిచే మోతీ మార్గిపై రాణా ప్రతాప్ స్మారకమైన కాంస్య విగ్రహాన్ని నిర్మించారు. ఫతేసాగర్ సరస్సుకు ఎదురుగా ప్రతాప్ స్మారకం ఉంది.

పిచోలా సరస్సు
ఉదయ్‌పూర్ అంటే అందరికీ గుర్తొచ్చేది పిచోలా సరస్సు. పిచోలా సరస్సులోని రెండు దీవుల్లో జగ్ మందిర్, నాగ్ నివాస్‌లను మహారాణా ఉదయ్ సింగ్ నిర్మించాడు. ఈ ప్యాలెస్‌లను చూడటానికి పడవలో చేరుకోవాలి.

ఉదయ్‌పూర్‌కు సమీపంలో శివుని దేవాలయమైన ఏక్‌లింగ్‌జీ (22 కి.మీ.), నాగ్డాలో సాస్-బహు దేవాలయం, హాల్డీఘాటీ (40 కి.మీ.), నత్‌ద్వారాలోని శ్రీనాథ్‌జీ దేవాలయం (48 కి.మీ.), కంక్రోలీలో ద్వారకాదీష్ దేవాలయం (65 కి.మీ.), రాజసముంద్ సరస్సు (66 కి.మీ.) వంటివి ఉన్నాయి.

వసతి
ప్రభుత్వ, ప్రైవేటు హోటళ్లుతో పాటుగా ఇతర వసతి సదుపాయాలు ఉన్నాయి.

విమాన మార్గం : ఉదయ్‌పూర్ విమానాశ్రయం నగరానికి సమీపంలో దబోక్ (24 కి.మీ.) వద్ద ఉంది. ఇక్కడి నుంచి ఢిల్లీ, జైపూర్, జోధ్‌పూర్, అహ్మదాబాద్, ముంబయి, ఔరంగాబాద్‌లకు విమాన సేవలు నడుస్తున్నాయి.

రైలు మార్గం : చిత్తోర్‌ఘర్, కోట, అజ్మీర్, జైపూర్, ఢిల్లీలకు నేరుగా రైలు సేవలు ఉన్నాయి. అహ్మదాబాద్‌కు మీటర్ గేజి మార్గంలో రైళ్లు నడుస్తున్నాయి.

రహదారి మార్గం : ఆగ్రా 630 కి.మీ., అహ్మదాబాద్ 262 కి.మీ., జైపూర్ 406 కి.మీ., జోధ్‌పూర్ 275 కి.మీ. దూరంలో ఉన్నాయి. రాజస్థాన్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఆర్ఎస్ఆర్టీసీ) అత్యాధునిక వసతులు గల బస్సులను ఈ నగరాలకు నడుపుతుంది.

Share this Story:

Follow Webdunia telugu