Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నయనానందం... 'జోగ్' జలపాత వీక్షణం

నయనానందం... 'జోగ్' జలపాత వీక్షణం

Munibabu

, గురువారం, 31 జులై 2008 (18:23 IST)
దేశంలోనే అత్యంత ఎత్తైన జలపాతంగా పేరుపడ్డ జోగ్ జలపాతం వీక్షణం ఓ అద్భుతమైన అనుభూతిని మన సొంతం చేస్తుంది. కర్ణాటక రాష్ట్రంలోని షిమోగా జిల్లాలోని సాగర్ తాలుకాలో ఈ జోగ్ జలపాతం ఏర్పడి ఉంది. దాదాపు 960 అడుగుల ఎత్తు నుండి జాలువారే జోగ్ జలపాతాన్ని స్థానికులు రాజా అని పిలుస్తుంటారు.

జోగ్ జలపాతం నాలుగు ధారలుగా లోయలోకి జాలువారుతుంటుంది. ప్రధానమైన జలపాతాన్ని రాజు అని పిలిచే స్థానికులు మిగిలిన వాటిని రాణి, రాకెట్, రోరర్ అనే పేర్లతో పిలుస్తుంటారు. జలపాతం జాలువారే కొండకు అభిముఖంగా ఉండే మరో కొండపై ఏర్పాటు చేసిన చదునైన ప్రదేశం నుంచి జోగ్ జలపాతాన్ని వీక్షించండం ఓ మరుచిపోలేని మధురానుభూతి.

జోగ్ జలపాతం విశేషాలు
కర్నాటకలో వ్యాపించిన పడమటి కనుమల మధ్య భాగంలో శరావతీ నదీ జలాల ప్రవాహం నుండి ఈ జోగ్ జలపాతం జన్మించింది. పడమటి కనుమల్లోని షిమోగా, తీర్థహళ్లి సమీపంలోని అంబుతీర్థ వద్ద ప్రారంభమయ్యే శరావతీ నది వాయువ్య దిశగా పయనించి హరిద్రావతి, ఎన్నెహోలే నదులను తనలో కలిపేసుకుంటుంది.


అక్కడి నుంచి ముందుకు సాగే ఈ ప్రవాహం కార్గళ్ సమీపంలో క్రింద ఉన్న అరణ్యపు లోయలోకి జాలువారుతుంది. ఇలా జాలువారే సుందర ప్రదేశమే జోగ్ జలపాతంగా పిలవబడుతోంది. జోగ్ జలపాతాన్ని వీక్షించాలంటే దానికి దూరంగా ఎదురువైపు ఉన్న మరో కొండపై నుంచి చూడాలి.

అలా జోగ్‌ను వీక్షించడానికి ఉపయోగపడే ఈ కొండపై పర్యాటకులు స్వేచ్ఛగా నిలుచునేందుకు పర్యాటకశాక ఏర్పాట్లు చేసింది. పై నుంచి లోయలోకి దూకే జోగ్ అందాన్ని లోయలో దిగి చూడాలనుకుంటే లోయలోకి దిగడానికి మెట్ల ఏర్పాటు కూడా ఉంది.
అలాగే ఈ ప్రాంతంలో 1948లో నిర్మించబడిన మహాత్మాగాంధీ జలవిద్యుత్ ప్రాజెక్ట్ కూడా ఓ చూడదగ్గ ప్రదేశం. దీంతోపాటు లింగనమక్కి డ్యాం అనేది కూడా పర్యాటకులు పర్యటించే ప్రదేశమే.

జోగ్ వద్ద వసతి, సౌకర్యాలు
జోగ్ ప్రాంతం పర్యాటకంగా ఎంతో ప్రాముఖ్యమున్న ప్రదేశం కావడంతో ఇక్కడ వసతి సౌకర్యాలకు ఎలాంటి లోటూ లేదు. కర్ణాటక పర్యాటక శాఖ వారిచే ఏర్పాటు చేయబడిన టూరిస్ట్ గెస్ట్ హౌస్‌లతో పాటు ఇతర ప్రైవేటు సంస్థలకు సంబంధించిన వసతి గృహాలు, వసతి గృహాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

జోగ్‌కు రవాణా సౌకర్యాలు
కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఈ జోగ్ రాజధాని బెంగుళూరు నగరం నుంచి దాదాపు 380 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే సాగర్ జిల్లా నుంచి 34 కిలోమీటర్ల దూరంలో ఉంది. బెంగుళూరు నుంచి సాగర్ చేరుకుని అక్కడి నుంచి జోగ్‌కు చేరుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu