Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కళ్యాణ చాళుక్యుల రాజధాని బీజాపూర్

కళ్యాణ చాళుక్యుల రాజధాని బీజాపూర్

Pavan Kumar

, మంగళవారం, 17 జూన్ 2008 (21:03 IST)
దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన కళ్యాణ చాళుక్యుల రాజధాని బీజాపూర్. మరికొందరు దీనిని విజాపురగా పిలిచేవారు. కళ్యాణ చాళుక్యుల పాలన తర్వాత బీజాపూర్ ముస్లిం రాజుల పాలనలోకి వచ్చింది. ఈ ప్రాంతాన్ని మొదట అల్లావుద్దీన్ ఖిల్జీ, ఢిల్లీ సుల్తానులు పాలించారు. 1347 సంవత్సరంలో బీదర్ బహమనీ రాజుల పాలనలోకి వచ్చింది బీజాపూర్.

బహమనీ సుల్తాను మూడవ మహ్మద్ 1481లో బీజపూర్ ప్రాంత గవర్నర్‌గా యూసఫ్ ఆదిల్ ఖాన్‌ను నియమించారు. బహమనీ సుల్తానుల పాలన చరమాంకంలోకి రావడంతో యూసఫ్ బీజపూర్‌ను స్వతంత్ర రాజ్యమని ప్రకటించాడు. దీనితో 1489లో ఆదిల్ షా వంశం నేతృతంలో బీజాపూర్ రాజ్యం అవతరించింది. మొఘల్ సామ్రాజ్యాధినేత ఔరంగజేబు బీజాపూర్‌ను ఆక్రమించుకునే వరకూ అంటే 1686 వరకూ ఆదిల్ వంశం వర్ధిల్లింది.

ఆదిల్ షా వంశ రాజుల కాలంలో బీజాపూర్ వాస్తుకళలకు కేంద్రం అయింది. బీజాపూర్ నగరంలోనే దాదాపు 50 మసీదులు, 20 సమాధులు, లెక్కలేనన్ని భవంతులు ఆదిల్ షా రాజులు నిర్మించారు. దీనికోసం వారు పర్షియాకు చెందిన వాస్తు కళ నిపుణులను ఇక్కడకు రప్పించి భవంతుల నిర్మాణాలను వేగిరం చేశారు.

బీజాపూర్ కోటను ఆదిల్ షా రాజు 1566లో నిర్మించారు. కోట చుట్టూ దుర్భేద్యమైన గోడను కట్టించారు. కోట లోపలికి వెళ్లే దారిలో అనేక బురుజులు ఏర్పాటుచేశారు. మహ్మద్ ఆదిల్ షా రాజు సమాధి గోల్ గుంబజ్. ప్రపంచంలోనే అతిపెద్ద డోమ్‌లలో రెండోది గోల్‌గుంబజ్. మొదటిది రోమ్‌లోని సెయింట్ పీటర్స్ బాసిలికా. గోల్‌గుంబజ్ లోపల ఏదైనా శబ్ధం చేస్తే అది ఏడుసార్లు పునరావృతమవుతుంది. గోల్‌గుంబజ్ ప్రాంగణంలో మసీదు, నక్కర్ ఖానా, ఇతర వసతి గృహాలు ఉన్నాయి.

వసతి
కర్ణాటక పర్యాటక శాఖకు చెందిన వసతి గృహంతో పాటుగా ఇతర సదుపాయాలు ఉన్నాయి.

ఎలా చేరుకోవాలి
విమాన మార్గం : హైదరాబాద్ (375 కి.మీ.) సమీపంలోని విమానాశ్రయం.
రైలు మార్గం : షోలాపూర్-గదగ్ మార్గంలో ఉంది బీజాపూర్ రైల్వే స్టేషన్. ఇక్కడి నుంచి హైదరాబాద్, బెంగళూరులకు రైలు సౌకర్యం ఉంది.
రహదారి మార్గం : బెంగళూరు 581 కి.మీ., బెల్గాం 205 కి.మీ. దూరంలో ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu