Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సర్వమతాల నిలయం గోరఖ్‌పూర్

సర్వమతాల నిలయం గోరఖ్‌పూర్

Pavan Kumar

, మంగళవారం, 3 జూన్ 2008 (20:28 IST)
ఉత్తర ప్రదేశ్‌లో ప్రముఖ ప్రాంతమైన గోరఖ్‌పూర్ సర్వమతాలకు నిలయం. నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ఉండటంవల్ల ఇక్కడ హిందూ, బౌద్ధ, జైన మతాలు విలసిల్లాయి. హిమాలయ పర్వతాల్లో ఉద్భవించిన రప్తి నది ఒడ్డున ఉంది గోరఖ్‌పూర్. భారత స్వాతంత్ర్యోద్యమ సమయంలో వివిధ ఘట్టాలకు నిలయం గోరఖ్‌పూర్.

గోరఖ్‌పూర్ ప్రాంతాన్ని సూర్యవంశ రాజులు పరిపాలించారు. వీరి రాజధాని అయోథ్య. ఆ తర్వాత కాలంలో ఇది కోశల సామ్రాజ్యంగా పిలిచేవారు. క్రీస్తు పూర్వం ఆరో దశాబ్దంలోని 16 మహాజనపదాల్లో ఒకటి కోశల. బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు, జైనమత 24వ తీర్థంకరుడు మహావీరుడు ఇక్కడే తిరగాడని అంటారు. మౌర్యులు, శుంగ, కుషాణ, గుప్త, హర్ష సామ్రాజ్యా కాలంలో విరాజిల్లింది గోరఖ్‌పూర్.

చూడవలసిన ప్రాంతాలు

గోరఖ్‌నాథ్ దేవాలయం
గోరఖ్‌నాథ్ 12వ శతాబ్దానికి చెందిన శైవ మత యోగి. ఈయన పేరు మీద నిర్మించినది గోరఖ్‌నాథ్ దేవాలయం. మకర సంక్రాంతి సమయంలో ఈ దేవాలయానికి భక్తులు భారీ సంఖ్యలో వస్తారు. నేపాల్ రాజు కూడా ఈ సమయంలో ఇక్కడి వచ్చి వెళతారని స్థానికులు అంటుంటారు. గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ నుంచి 4కి.మీ. దూరంలో నేపాల్ రోడ్‌లో ఉంది గోపాల్‌నాథ్ దేవాలయం.

విష్ణు దేవాలయం
శ్రీ మహావిష్ణువు నల్లరాతి స్వరూపం ఉన్న దేవాలయం ఇది. 12వ శతాబ్దానికి చెందిన పాల రాజులు ఈ దేవాలయాన్ని కట్టించారని అంటారు. దసరా సమయంలో నిర్వహించే రామలీలా ఉత్సవాలు ఇక్కడ ఆర్భాటంగా జరుగుతాయి.

గీతా ప్రెస్
గోరఖ్‌పూర్‌లోని రెట్టీ చౌక్‌లో గీతా ప్రెస్ ఉంది. శ్రీమద్‌భాగవతాన్ని ఇక్కడి పాలరాతి రాళ్లపై చెక్కి ఉంచిన నిలయం. సాకేత రాముడు, వాసుదేవుడైన శ్రీకృష్ణుడిని లీలలకు సంబంధించిన అంశాల చిత్రాలు ఇక్కడ ఉన్నాయి. హిందూ మతానికి చెందిన రకరకాల గ్రంధాలను వివిధ భాషల్లో ముద్రిస్తున్న సంస్థ గీతా ప్రెస్ ఒక్కటే.

వీటితో పాటుగా రసూల్ పూర్‌, గోరఖ్‌నాథ్‌లోని జామా మసీదు, రేతి రోడ్‌లో మదీనా మసీదు, బుద్ధుని మ్యూజియం వంటివి ఉన్నాయి.

వసతి
గోరఖ్‌పూర్‌లో వివిధ తరగతుల వారికి తగిన వసతి సదుపాయాలు ఉన్నాయి.

ఎలా చేరుకోవాలి

విమాన మార్గం : గోరఖ్‌పూర్ 6కి.మీ. దూరంలో విమానాశ్రయం ఉంది. ఇక్కడి నుంచి జెట్‌లైట్ విమాన సంస్థ సేవలను అందిస్తోంది.
రైలు మార్గం : గోరఖ్‌పూర్ ప్రధాన రైల్వే జంక్షన్. ఇక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి.
రహదారి మార్గం : గోరఖ్‌పూర్ మీదగా జాతీయ రహదారి నెం. 28. 29 వెళుతున్నాయి. రాష్ట్ర రాజధాని లక్నో 276 కి.మీ., వారణాసి 231 కి.మీ., అలహాబాద్ 339 కి.మీ. ల దూరంలో ఉంది.

Share this Story:

Follow Webdunia telugu