Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంచు స్వాగతాన్నిచ్చే "కులు-మనాలి"

మంచు స్వాగతాన్నిచ్చే
మంచులో పరుగెడుతూ చిన్నపిల్లల్లా ఆడుకోవాలన్న కోరిక కలిగినవారు తప్పనిసరిగా పర్యటించాల్సిన ప్రాంతమే కులు-మనాలి. కులు మనాలి అంటే ఒకే ఊరి పేరు అని ఎవరైనా అనుకుంటారు. అయితే కులు, మనాలి అనేవి రెండు వేరు వేరు ఊరి పేర్లు. ఇవి హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో చిట్టచివర్లో ఉంటాయి. ముందుగా కులు, అక్కడి నుంచి 45 కిలోమీటర్ల దూరంలో మనాలిలు... తెల్లటి మంచుదుప్పటి కప్పుకుని మరీ మనకు స్వాగతం పలుకుతాయి.

సిమ్లా నుంచి మనాలి 260 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సుమారుగా తొమ్మిది గంటలసేపు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దేశ రాజధాని నగరం ఢిల్లీ నుంచీ సరాసరి మనాలికి వెళ్లే ప్యాకేజీ బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. ఢిల్లీ నుంచయితే సుమారు 18 గంటలసేపు ప్రయాణించాలి.

కులు, మనాలీలు పుణ్యక్షేత్రాలు ఎంత మాత్రం కావు. ఇవి రెండూ కేవలం వేసవి విడిది కేంద్రాలు మాత్రమే. కులులో రఘునాథ్, మనాలిలో హిడింబి ఆలయాలు ఉంటాయి. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం మొత్తం హిమాలయా పర్వత శిఖరాల నడుమ నెలకొని ఉంటుంది. అందువల్ల కులు, మనాలి ఊర్ల చుట్టూ ఎత్తయిన కొండలే మనకు దర్శనమిస్తాయి.

వేసవికాలంలో కులు, మనాలిలలో చాలా చల్లగా ఉంటుంది. అయితే చుట్టూ ఉన్న కొండలన్నీ ఒక్కటంటే ఒక్క పచ్చని చెట్టు అనేది లేకుండా బోడికొండలుగా ఉంటాయి. వర్షాకాలం అయిన తరువాతనే అంటే సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో చెట్లన్నీ పచ్చగా కళకళలాడుతూ చూడముచ్చటగా ఉంటాయి. సెప్టెంబర్ నాటికిగానీ ఆపిల్ పండ్ల పంట రాదు.

నవంబర్ నుంచి కులు, మనాలి ప్రాంతాల్లోని కొండలన్నీ మంచుతో నిండి ఉంటాయి. మనాలి నుంచి 55 కిలోమీటర్ల దూరంలో రొహతంగ్ కనుమ చూడదగ్గ ప్రాంతం. ఈ కనుమ దాటి అవతలకు వెళితే హిమాచల్‌లో చిట్టచివరగా ఉండే లాహుల్ జిల్లా వస్తుంది. దాని ఆవల లడక్ ప్రాంతం ఉంది.

నవంబర్ నుంచి ఏఫ్రిల్ మాసాల దాకా మనాలి నుంచి అటువైపు ఉండే కొండలన్నీ మంచుతో నిండిపోతాయి. మనాలి నుంచి కనీసం రొహతంగ్ కనుమదాకా కూడా వెళ్లేందుకు వీలు లేకుండా, మార్గాలన్నీ మంచుతో మూసుకుపోతాయి. కులు, మనాలిలలో అసలయిన అందం నవంబర్ నుంచే ప్రారంభం అవుతుందని చెప్పవచ్చు.

ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి మాసాలలో ఇక్కడ మంచుమీద జరిగే స్కైయింగ్ ఆటలు చాలా ఆహ్లాదంగా సాగుతాయి. కేవలం మంచులో పరుగెడుతూ ఆడుకోవాలన్న ఆసక్తితోనే సాధారణ పర్యాటకులు కూడా ఇక్కడికి పెద్దఎత్తున వస్తుంటారు. అందుకే ఈ నెలల్లో కులు, మనాలి ప్రాంతాలలోని హోటళ్లలో గదులు దొరకడం చాలా కష్టతరం.

మంచు కురిసే నెలల్లో కులు, మనాలిలకు వచ్చే పర్యాటకులు దాదాపు ఎగువ మధ్యతరగతి ప్రజలే వస్తుంటారు. కాబట్టి, ఇక్కడి గదుల అద్దె దాదాపు 800 నుంచి వెయ్యి రూపాయలదాకా ఉంటుంది. అదే ఇవే గదులు సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో 300 నుంచి, 400 రూపాయల వరకు మాత్రమే ఉంటాయి. కులు, మనాలిలలో చక్కటి ఆంధ్రా పచ్చళ్లు, పప్పుతో సహా, మాంచి తెలుగు భోజనాన్ని ఏర్పాటు చేసే హోటళ్లు కూడా ఒకటి, రెండు ఉండటం ఇక్కడి విశేషం.

Share this Story:

Follow Webdunia telugu