Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంచు పర్వతాల్లోని "రేణుకా క్షేత్ర" దర్శనం కమనీయం..!!

మంచు పర్వతాల్లోని
FILE
హిమాచల్ ప్రదేశ్ అనే పేరు చెప్పగానే మంచు పర్వతాలు, ప్రకృతి దృశ్యాలతో నిండిన విహార యాత్రా స్థలాలే ఎవరికైనా ఇట్టే గుర్తుకొస్తాయి. అయితే ఈ మంచు పర్వతాలలో అతి పురాతనమైన చరిత్ర కలిగిన దర్శనీయ క్షేత్రాలున్నాయంటే చాలామందికి నమ్మకం కలగదు. ఇక్కడి ఆలయాల్లో శిల్పకళను చూస్తే మైమరచిపోతాం. అలాంటి పుణ్యక్షేత్రాలలో ఒకటే "రేణుకా క్షేత్రం".

హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రేణుక అనే ఊరు ఒక పుణ్యక్షేత్రంగానే కాకుండా, ప్రసిద్ధమైన విహార యాత్రాస్థలంగా కూడా పేరుగాంచింది. ఇక్కడ రేణుకాదేవి పేరుతో ఓ ఆలయం ఉంది. అదే ఊరి పేరు కూడా కావటం మాత్రం యాదృచ్ఛికమే. హిమాలయా పర్వతాలకు ఇవతలగా ఉన్న మైదాన ప్రాంతానికి మధ్యలో అంత ఎక్కువ ఎత్తులేని వరుస కొండలమధ్య కొలువై ఉండే శివాలిక్ పర్వత శ్రేణులకు, హిమాలయా పర్వతాలకు మధ్యలో రేణుక అనే ఈ ఊరు ఉంది.

రేణుక ఊరు ఉన్న ప్రదేశం ఎత్తు కేవలం 600 మీటర్లు మాత్రమే. అందువల్ల ఇక్కడ ఎక్కువగా చలి ఉండదు. ఈ ప్రాంతానికి ఏ కాలంలోనయినా నిక్షేపంగా వెళ్లవచ్చు. ఇక ఈ ఊరికి నైరుతీదిశగా 36 కిలోమీటర్ల దూరంలో "నేహాన్" అనే పట్టణం ఉండగా.. తూర్పు దిశలో 50 కిలోమీటర్ల దూరంలో "పావుంటా సాహెబ్" అనే పవిత్ర సిక్కు క్షేత్రం కలదు. కాబట్టి.. ముందుగా నేహాన్ లేదా పావుంటా చేరుకుంటే, అక్కడినుంచి రేణుక చేరుకోవటం చాలా సులభం.

నేహాన్ నుంచి దక్షిణంగా 14 కిలోమీటర్ల దూరంలో "త్రిలోకపూర్" అనే ఊరిలోగల "మహామాయ బాలసుందరి" చూడదగ్గ మరో పుణ్యక్షేత్రం. నేహాన్‌లో 16వ శతాబ్దంనాటి "జగన్నాథ మందిరం" కూడా ఉంది. పావుంటా సాహెబ్ అనే ఊరు సిక్కుల గురువులలో ఆఖరివాడైన "గురుగోవింద సింగ్" జీవితంతో సంబంధం ఉన్న క్షేత్రం. అందుకే రేణుకను దర్శించేవారు ఈ క్షేత్రాలన్నింటినీ చూసేందుకు ప్రాముఖ్యత చూపిస్తారు.

webdunia
FILE
రేణుక పుణ్యక్షేత్రంలోని దర్శనీయ స్థలాల విషయానికి వస్తే.. రేణుక ఊరిలో ఓ పెద్ద సరస్సు ఉంది. హిమాచల్‌ప్రదేశ్ మొత్తంమీదా సహజంగా ఏర్పడిన సరస్సులలో ఇదే అతి పెద్దది కావటం విశేషంగా చెప్పవచ్చు. ఈ సరస్సు శివాలిక్ పర్వత శ్రేణుల వరుసలకూ, హిమాలయా పర్వతాలకూ మధ్యలో ఒక చిన్న లోయలాంటి ప్రదేశంలో ఏర్పడింది. అంతేగాకుండా.. ఈ సరస్సు అడుగున సహజంగా ఏర్పడిన నీటి ఊటలున్నాయి.

సరస్సు అవతలవైపున దట్టమైన అడవి ఉంటుంది. ఈ సరస్సును దర్శించేందుకు వచ్చేవారిలో ఎక్కువమంది బోటు షికారుకు, తరువాత గట్టున ఉండే అడవిలోగల లయన్ సఫారీని చూసేందుకే వస్తుంటారు. ఈ సరస్సు ఒడ్డునే, తండ్రి ఆజ్ఞ మేరకు పరశురాముడు తన తల్లి రేణుకాదేవి తల నరికాడనీ, తండ్రి ఇచ్చిన వర ప్రభావం చేత తల్లిని తిరిగి బ్రతికించుకున్నాడనీ స్థలపురాణం చెబుతోంది.

అందుకనే ఈ సరస్సు ఒడ్డునే రేణుకాదేవికి, పరశురాముడికి వేరు వేరుగా ఆలయాలను నిర్మించారు. రేణుకాదేవి ఆలయం ఒకే ఒక్క రాతితో నిర్మాణమైనట్లుగా చెబుతుంటారు. ఈ రెండు ఆలయాలే కాకుండా, సరస్సు ఒడ్డునే గాయత్రిదేవి ఆలయం.. శివ, విష్ణు, గణపయ్యల ఆలయాలు కూడా ఉన్నాయి. పర్వత సౌందర్యంతోపాటు, ప్రకృతి సౌందర్యం మేళవించిన భక్తి పారవశ్యంతో పరవసింపజేసేలా ఉండే ఈ ప్రాంతంలో పర్యాటకులు, భక్తుల సౌకర్యార్థం అనేక హోటళ్లు, లాడ్జీలు అనేకం అందుబాటులో ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu