Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎడారిలో మంచు పుష్పం "మౌంట్ అబూ"

ఎడారిలో మంచు పుష్పం
FILE
ఆరావళీ పర్వత శ్రేణులలో అందమైన రాణిలాగా వెలిగిపోతుండే "మౌంట్ అబూ" చిరునవ్వుతో సుస్వాగం పలుకుతున్నట్లుగా ఉంటుంది. పకృతి గీసిన చిత్రాలనే కాకుండా, పరవశింపజేసే ఆలయాలను సైతం తనలో ఇముడ్చుకున్న మౌంట్ అబూలో రాజస్థాన్ హస్తకళల అందాలకూ కొదవేలేదు.

అలాగే నక్కి సరస్సు జల సౌందర్యం, దిల్‌ఖుష్ చేసే దిల్‌వారా ఆలయాలు, వశిష్ట మహర్షి ఆశ్రమం... ఇలా ఒక్కటేమిటి, ఒకసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించే అద్భుతమైన ప్రదేశం "మౌంట్ అబూ". ఎర్రటి ఎండలనే కాదు, చల్లటి మౌంట్ అబూను తనలో దాచుకున్న రాజస్థాన్ వెళ్లేందుకు "అయ్యో.. ఎర్రటి ఎండల్లోనా...?" అని గాబరా పడాల్సిందేమీ లేదు.. ఎంచక్కా మన మౌంట్ అబూ ఉండనే ఉందిగా మరి...!!

ఆరావళీ పర్వతశ్రేణులలో ఉండే "అబూ" అనే కొండమీద ఉన్న ఒక చిన్న పట్టణమే "మౌంట్ అబూ". సుమారు నాలుగు వేల అడుగుల ఎత్తున ఉన్న కొండమీద ఉండే ఈ అబూ పట్టణం రాజస్థాన్ రాష్ట్రం దక్షిణపు అంచుల్లోను, గుజరాత్ రాష్ట్రానికి ఆనుకుని ఉంటుంది.

ఇక్కడ మనసును దోచుకునే అతి గొప్ప విశేషం ఏంటంటే... దిల్‌వారా అనే చోట ఉండే జైన దేవాలయం. లలితకళలు, శిల్పం ఇత్యాది విషయాలపట్ల ఏ మాత్రం ఆసక్తిలేనివారు సైతం దిల్‌వారాలోని ఆలయాలను చూస్తే నిశ్చేష్టులైపోతారు. అంత సుందరంగా ఉండే ఆ ఆలయాలను 12 గంటల తరువాత మాత్రమే తెరుస్తారు. వీటిని తృప్తిగా చూడాలంటే కనీసం రెండు గంటల సమయం అవసరం. ఇక్కడి "అచలాగడ్" అనే ప్రదేశంలోని ఈశ్వరుడి గుడి కూడా చాలా ప్రాశస్త్యమైనదే.
సూర్యాస్తమయం అత్యద్భుతం
నక్కి సరస్సు ఒడ్డుమీద సుమారు ఒక కిలోమీటర్ దూరం నడచి వెళ్ళినట్లయితే... సరస్సుకు పడమటివైపున ఉండే రెండు చిన్న కొండల నడుమ కనిపించే సూర్యాస్తమయ దృశ్యం అత్యద్భుతంగా ఉంటుంది. ఈ దృశ్యం చూసేందుకు వెళ్లే దారిలోనే ఒక చోట చిన్న గుట్టమీద ఒకరాయిపై మరో రాయి...
webdunia


"ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయం" అనేది మౌంట్ అబూలో చెప్పుకోదగ్గ ప్రపంచ ప్రఖ్యాత సంస్థ. ఈ పట్టణానికి బయట దాదాపు 4 కి.మీ దూరంలో ఉండే ఈ సంస్థకు సంబంధించిన మూడు ప్రదేశాలు చాలా ముఖ్యమైనవి. ఒకటి.. జ్ఞాన సరోవర్, రెండు.. ఓం శాంతి భవనం, మూడు.. శాంతివనం.

ఈ మూడు ప్రాంతాలలో ఎన్నో ఎకరాల విస్తీర్ణం ఉన్న ఉద్యానవనాల మధ్య, మనం ఊహించలేనంత పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి. ఈ మూడింటిలోనూ బ్రహ్మకుమారి సంస్థకు సంబంధించిన తాత్విక చింతన, ఆధ్యాత్మిక దృష్టికి సంబంధించిన విషయాలు మాత్రమే ఉంటాయి. ఈ భవనాలలోని చిత్రాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఆ తరువాత అబూ నడిబొడ్డున ఉండే రోడ్డుపైనే వీరి "మ్యూజియం" కూడా కలదు.

అబూ పట్టణం నెలవైన కొండ ప్రాంతానికి అధిదేవతగా పిలువబడే "అధర్‌దేవి ఆలయం" కూడా చూడదగ్గది. దీనినే అర్బుదదేవి మందిరం అని కూడా అంటుంటారు. అబూ పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో కొండ అంచున ఉండే ఓ చిన్న గుడే ఇది. ఈ చిన్న ఆలయం ఒక చిన్న గుహలాంటి చోట ఉంటుంది. ఇక్కడికి చేరుకోవాలంటే, సుమారు 200 మెట్లు కొండ అంచునే ఎక్కుతూ వెళ్లాలి.

ఇక మౌంట్ అబూకు మూడు కి.మీ దూరంలో కొండ అంచున ఉండే అద్భుతమైన ప్రాంతం "హనీమూన్ పాయింట్"గా పేరుగాంచింది. ఈ కొండ ఆనుకుని నిట్టనిలువుగా కొన్ని వందల అడుగుల లోతులో ఉండే చదునైన లోయప్రాంతం, దూరంగా ఉండే ఒకటి రెండు చిన్న గ్రామాలతో కూడినదే ఈ ప్రాంతం. కొండ అంచున నిలబడి ఈ మనోహరమైన దృశ్యం చూసేందుకు అనువుగా ఇక్కడ సిమెంట్‌తో ఫ్లాట్‌ఫామ్స్ కట్టబడి ఉంటాయి.

webdunia
FILE
అబూ నుంచి సుమారు 12 కి.మీ దూరంలోని కొండమీద ఉండే "గురు శిఖర్ ఆలయం" కూడా ఎంతో ప్రసిద్ధి. 5653 అడుగుల ఎత్తులో ఉండే ఈ ఆలయ శిఖరం అబూలోని కొండ శిఖరాలన్నింటిలోకి ఎత్తైనది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో కూడిన త్రిమూర్తి రూపంతో ఉండే విగ్రహాలు గల ఈ ఆలయంలో గురు దత్తాత్రేయుడి పాద ముద్రలు కలిగిన మరో చిన్న ఆలయం కూడా ఉంది.

మౌంట్ అబూ నగరానికి మధ్యలో మెయిన్ బజారుకు ఆనుకుని ఉండే "నక్కి" సరస్సు గురించి చెప్పాలంటే.. పెద్దగా వర్ణించే అందాలు ఏమీ లేవు. అయితే ఒకప్పుడు దేవతలు వచ్చి స్వయంగా తమ గోళ్ళతో ఈ సరస్సును తవ్వారని ప్రతీతి. అందుకనే దీనికి నక్కి సరస్సు అనే పేరు వచ్చిందని స్థానికుల కథనం. 14వ శతాబ్దంలో నిర్మించబడిన రఘనాథ్‌జీ మందిరం, దాన్ని ఆనుకుని దూలేశ్వర్ మహదేవ ఆలయం.. తదితరాలు కూడా ఈ సరస్సును ఆనుకునే ఉంటాయి.

నక్కి సరస్సు ఒడ్డుమీద సుమారు ఒక కిలోమీటర్ దూరం నడచి వెళ్ళినట్లయితే... సరస్సుకు పడమటివైపున ఉండే రెండు చిన్న కొండల నడుమ కనిపించే సూర్యాస్తమయ దృశ్యం అత్యద్భుతంగా ఉంటుంది. ఈ దృశ్యం చూసేందుకు వెళ్లే దారిలోనే ఒక చోట చిన్న గుట్టమీద ఒకరాయిపై మరో రాయి నిట్టనిలువుగా ఉంటుంది. దీనినే కప్ప పిల్లరాయి అని పిలుస్తారు.

ఇంకా మౌంట్ అబూలో చూడదగ్గ విశేషాల విషయానికి వస్తే... రుషికేశ్ ఆలయం, వశిష్ట మహర్షి ఆశ్రమం, అచలేశ్వర ఆలయం.. తదితర ప్రాంతాలెన్నో ఉన్నాయి. ముఖ్యంగా దిల్‌వారాలో ఉన్న అద్భుత ఆలయాలను చూడడం ఒక అపురూపమైన అనుభూతి. మన దక్షిణ భారతీయులకు ఊటీ, కొడైకెనాల్ ఎలాగో... ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ వాసులకు మౌంట్ అబూ కూడా ఒక వేసవి విడిదిలాంటిదని చెప్పవచ్చు.

మౌంట్ అబూకు చేరుకోవడం ఎలాగంటే...?
అన్ని ముఖ్యమైన పట్టణాల నుంచి అబూ పట్టణానికి బస్సులు ఉన్నాయి. అబూ రోడ్ అనే పేరుతో ఉండే ఓ రైల్వేస్టేషన్ నుంచి అబూ పట్టణానికి చేరుకోవాలంటే 37 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి బస్సులు, జీపులు, ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. వాటిలో వెళ్లాలంటే... బస్సు ఛార్జీ అయితే మనిషికి 7 రూపాయలు కాగా.. అదే జీపులోనయితే మనిషికి 20 రూపాయలు మాత్రమే. ఇక ట్యాక్సీకయితే 150 రుసుమును వసూలు చేస్తుంటారు.

Share this Story:

Follow Webdunia telugu