Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అందమైన గుహల సముదాయం ఎల్లోరా

అందమైన గుహల సముదాయం ఎల్లోరా

Munibabu

, గురువారం, 17 జులై 2008 (12:51 IST)
భారతదేశంలోని పర్యాటక ప్రాంతాల్లో ఓ అద్భుతమైన ప్రాంతంగా ఎల్లోరా గుహల్ని గురించి చెప్పవచ్చు. కొండలను తొలచి వాటికి అద్భుతమైన రూపాన్ని ఇచ్చిన ఆనాటి శిల్పకళా నైపుణ్యానికి ఈ ఎల్లోరా గుహలు సజీవ సాక్షాలు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు అతికొద్ది దూరంలో ఉన్న ఈ ఎల్లోరా గుహలను ఏడాది పొడవునా పర్యాటకులు సందర్శిస్తూనే ఉంటారు.

ఎల్లోరా గుహల విశేషాలు
ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన ఎల్లోరా గుహలు పర్యాటకుల మనసులో చెరగని ముద్ర వేస్తాయనడంలో సందేహం లేదు. దాదాపు రెండు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన 34 గుహలు హిందూ, జైన, బౌద్ద మత సంస్కృతులకు చిహ్నాలుగా నిర్మింపబడ్డాయి.

ఇందులో 12 గుహలు బౌద్ధ సంస్కృతికి సంబంధించినవి కాగా హిందూ సంస్కృతికి సంబంధించి 17 జైన మతానికి సంబంధించి 5 గుహలు ఉన్నాయి. ఆయా గుహల్లో ఆయా మతాలకు సంబంధించిన వివిధ సంస్కృతీ, సాంప్రదాయాలు ఉట్టిపడేలా శిల్పులు ఈ గుహలను నిర్మించడం గమనార్హం. చాళుక్యులు, రాష్ట్రకూటుల పరిపాలనా కాలంలో ఈ గుహలను చెక్కినట్టుగా చరిత్ర పేర్కొంటోంది.

అద్భుత దృశ్యం కైలాస దేవాలయం
ఎల్లోరా గుహల్లో అద్భుతమైన నిర్మాణంగా చెప్పుకోవాల్సింది కైలాస దేవాలయం గురించే. ప్రారంభం నుంచి 16వ గహలో ఉన్న ఈ ఏకశిలా నిర్మాణం ఓ అద్భుతమైన శివ సన్నిధి. ఈ దేవాలయంలోకి అడుగుపెట్టగానే కన్పించే ద్వజస్థభం చూపరులను కట్టిపడేస్తుంది. ఈ ద్వజస్థంభ నిర్మాణం అద్భుతంగా ఉంటుంది.


దాదాపు 60వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ ఆలయానికి రెండువైపులా రెండంతస్థుల నిర్మాణాలు ఉన్నాయి. వీటి నిర్మాణం సైతం పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ఈ ఆలయంలో హిందూమత ఇతిహాసాలైన రామాయణ, మహాభారత గాధలను చెక్కడం విశేషం.

ఇక బౌద్ధమతానికి సంబంధించి ఏర్పరిచిన గుహల్లో పదవ గుహ చాలా ముఖ్యమైంది. విశ్వకర్మ గుహగా పేర్కొనే ఇందులో ఉన్న పదిహేను అడుగుల బుద్ధుని ప్రత్రిమ పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ గుహలో మనం చేసే శబ్ధం గుహ మొత్తం ప్రతి ధ్వనించడం విశేషం.

ఎల్లోరాకు ప్రయాణం
ఔరంగాబాద్‌ నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లోరా గుహల వద్దకు చేరాలంటే కావాల్సిన అన్ని రవాణా సౌకర్యాలు ఔరంగాబాద్ బస్సు, రైల్వే కేంద్రాలనుంచే లభిస్తాయి.

ఇక్కడి రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఉన్న మహారాష్ట్ర టూరిజం శాఖ కార్యాలయంలో ఎల్లోరాకు సంబంధించిన అన్ని విశేషాలతో పాటు రవాణా, గైడ్ అన్ని సౌకర్యాలు అందజేయబడుతాయి. ఇక్కడి నుంచి ఏసీ, నాన్ ఏసీ బస్సులు పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి. ఎల్లోరా వద్ద భోజన తదితర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu