Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పల్లె లోగిళ్ళకు సంక్రాంతి శోభ

పల్లె లోగిళ్ళకు సంక్రాంతి శోభ
సంక్రాంతి పండుగలో భాగంగా మంగళవారం పెద్దపండుగను దేశప్రజలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. సోమవారం భోగి పండుగను జరుపుకున్న ప్రజలు.. మంగళవారం పెద్దపండుగ (సంక్రాంతి)ను భక్రిశ్రద్ధలతో జరుపుకున్నారు. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగతో గ్రామీణ ప్రాంతాలకు ప్రత్యేక శోభ వచ్చింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో పల్లెలు పచ్చగా కళకళలాడాయి. వరి పరిస్థితి మెరుగ్గా ఉండడంతో రైతులు సంతృప్తిగా ఉన్నారు.

అలాగే.. చిన్న, సన్నకారు రైతులేగాక రైతు కూలీలు కూడా చేతినిండా పనులు ఉండటంతో సంక్రాంతి పండుగకు సంతోషంగా స్వాగతం చెప్పారు. ఈ సంక్రాంతి పండుగ రోజున గ్రామీణ ప్రాంతాలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. తెల్లవారు జామున హరిదాసు కీర్తనలతో మేలుకొలుపులు. ఇళ్ళ వాకిళ్ళలో రంగు రంగుల రంగవల్లికలు.

అందంగా అలికిన వాకిళ్ళ మధ్య బంతి, చామంతుల సొగసులు. ఊరు మధ్య చెరువులో కలువ బాలల అరవిరిసిన అందాలు. పట్టు పావడాలతో జలతారు ఓణీలతో సిగ్గుల బుగ్గల మీద మొగ్గలై విరియగా, జడగంటల వయ్యారాలతో కన్నెపిల్లలు ఆడే చెమ్మచెక్కలు, ఒప్పుల కుప్పలు, గంగిరెద్దుల ఆటలు, పొలాల్లో ధాన్యాల పంట సిరుల గుట్టలు, గుమ్మాలకు మామిడి తోరణాలు ఎటు చూసినా పౌష్యలక్ష్మి వైభవం తాండవించింది.

పురణాల్లో సంక్రాంతి...
ప్రజలంతా తమ బాధలు, కష్ట నష్టాలు, వైరాలు మరిచి ప్రపంచంలోని ఆనందమంతా అనుభవించే రోజు సంక్రాంతి. వామనుడు తనను పాతాళలోకానికి తొక్కేస్తాడని తెలిసినా, దాన గుణం చూపిన బలిచక్రవర్తి బలి చెందింది ఈ రోజే. ఆ బలి చక్రవర్తి ఆవహించి కాబోలు, సంక్రాంతి నాడు అందరూ కొద్దో గొప్పో దానం చేస్తారు. అన్ని కులాల వారు తమ పెద్దలను తలుచుకుని నవధాన్యాలు, నూతన వస్త్రాలు బ్రాహ్మణులకు, పెద్దలకు సమర్పిస్తారు. హరిదాసులు, పగటి వేషగాళ్లు, పిట్టల దొరలు, గంగిరెద్దుల వారికి రైతన్నలు కానుకలు సమర్పిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu