ప్రస్తుత నాగరిక సమాజంలో పాలు, పాల ఆధారిత పదార్థాలు, గుడ్లు, కోడిమాంసం, పళ్లరసాలు, కేకులు, పిజ్జా, జంక్ ఫుడ్ తినడం సర్వసాధారణం. అందరి ఇళ్లలోనూ ప్రత్యేకించి చిన్న పిల్లలు పిజ్జాలు, మిల్క్ ప్రోడక్ట్స్‌లను ఇష్టంగా తింటుంటారు. అయితే వీటిల్లో పీచు పదార్థం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మలబద్ధకం లాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
పీచు పదార్థాలు... మనం తీసుకున్న ఆహారం జీర్ణం అయ్యాక మిగిలిన పదార్థాలను చిన్న పేగుల్లో, పెద్ద పేగుల్లో ముందుకు నెట్టేందుకు ఉపకరిస్తాయి. అందుబాటులో ఉండే ఆహార పదార్థాలు, ఆహారపు అలవాట్లు ప్రాంతాలను బట్టి వేర్వేరుగా ఉంటాయి. ఈ రకంగా చూస్తే... గ్రామీణ ప్రాంతాలలో నివసించే వారికి మలబద్ధకం లాంటి సమస్యలు దరి చేరవు.
ఎందుకంటే... పల్లె ప్రాంతాల్లో నివసించేవారు ముడిబియ్యం, ముడి గోధుమలు, ఇతర ధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలు, తాజా కూరగాయలు, ఆకుకూరలు లాంటివి తీసుకుంటుంటారు కాబట్టి వారికి మలబద్ధకం సమస్య చాలా తక్కువగా వస్తుంటుంది. అదే పట్టణ ప్రాంతాలలో నివసించే నేటితరం ఎక్కువగా ఫాస్ట్‌ఫుడ్‌కు అలవాటుపడటంతో ఆహారంలో పీచు పదార్థాల శాతం తగ్గిపోయి మలబద్ధకానికి గురవుతున్నారు.
ఇకపోతే... నిర్ణీత సమయంలో క్రమబద్ధంగా కష్టతరమైన మలవిసర్జననే మలబద్ధకం అంటారు. పెద్ద పేగు ద్వారా విసర్జితం కావాల్సిన మలం పరిమిత కాలానికి మించి అక్కడ నిలువ ఉన్నప్పుడు అందులోని ద్రవ పదార్థాలు పెద్ద పేగు గోడల్లోకి పీల్చబడతాయి. దీంతో మలంలోని ద్రవం పాళ్లు తగ్గడంతో, తన మృధుత్వాన్ని కోల్పోయి గట్టిపడి మలబద్ధకంగా తయారవుతుంది.
ఈ రకంగా మలంలోని ద్రవాలు మళ్లీ రక్త ప్రసరణలో కలవటం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ కలుషితం కావడం, మూత్రపిండాలమీద భారం పెరగడం లాంటి సమస్యలు ఏర్పడతాయి. దాంతో అనేక వ్యాధులకు అది మూలకారణం అవుతుంది. ఈ విషయాలను పెద్దలే పిల్లల దృష్టికి తీసుకువెళ్లి వాళ్లకు ఈ విషయాలపై అవగాహన కల్పించటం తప్పనిసరి.
ఇప్పటికే మలబద్ధకం బారిన పిల్లలకు ప్రతిరోజూ ముడి మెంతులను రెండు టీస్పూన్ల వంతున నమలకుండా రాత్రి సమయంలో నీటితో మింగించాలి. ఎందుకంటే, మెంతులలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటంవల్ల సులభంగా విరేచనం అవుతుంది. అలాగే కరక్కాయ, తానికాయ, ఉసిరికాయల మిశ్రమమైన త్రిఫలాచూర్ణం ప్రతిరోజూ రాత్రివేళ్లలో ఫలితం ఉంటుంది. ముఖ్యంగా పీచు పదార్థం అధికంగా ఉండే బొప్పాయి, బత్తాయి, నారింజ, పనసపళ్లను పిల్లలకు ఎక్కువగా ఇవ్వటం మంచిది.