Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విష్ యూ హ్యాపీ బర్త్‌ డే మై డియర్ "టామ్‌ అండ్‌ జెర్రీ"..!!

విష్ యూ హ్యాపీ బర్త్‌ డే మై డియర్
PTI
చూస్తుండగానే కొట్టుకోవటం, గొడవపడటం.. అంతలోనే స్నేహితుల్లాగా మారిపోవటం.. ఒకరివెంట ఒకరు పరుగులెత్తటం, ఇంట్లో వస్తువులన్నింటినీ ధ్వంసం చేయటం, యజమానితో గెంటించుకోవటం, ఒకరినొకరు భయపెట్టుకోవటం.... ఇలాంటివన్నీ తల్చుకుంటే వెంటనే ఎవరికైనా గుర్తొచ్చేది "టామ్ అండ్ జెర్రీ"లే. నేడు టామ్ (పిల్) అండ్ జెర్రీ (ఎలుక)ల జన్మదినం. అచ్చంగా మనుషుల ప్రవర్తనలాగే ఉండే ఈ టామ్ అండ్ జెర్రీలు పుట్టి ఈ రోజుకి అంటే ఏఫ్రిల్ 1వ తేదీ నాటికి 70 సంవత్సరాలు నిండాయి. అసలు ఈ టామ్ అండ్ జెర్రీల కథా కమామీషేంటో అలా ఓ లుక్కేద్దామా..?!

తెరపై ఎప్పుడు చూసినా గొడవపడుతూ కనిపించే టామ్ అండ్ జెర్రీల మధ్య శతృత్వం ఈ నాటిది కాదు. వీరి మధ్య ఉండే వైరాన్ని విలియమ్ హన్నా, జోసెఫ్ బార్బరాలు 1940వ సంవత్సరంలో హాస్య రూపక కార్టూన్‌ల ద్వారా వెలుగులోకి తీసుకొచ్చారు. ఇక అప్పటినుంచి ఇప్పటిదాకా ఈ కార్టూన్ సీరియళ్లు.. ఇతర ఏ చిత్రాలకూ లేనంత డిమాండ్‌తో.. దేశం, భాష, వయసు బేధాలనేవి లేకుండా ప్రతి ఇంట్లోనూ నవ్వుల పువ్వులు పూయిస్తూనే ఉన్నాయి. ఇప్పటిదాకా టామ్, జెర్రీలను మించిన హాస్యాన్ని అందించే మరో కార్టూన్ చిత్రం రాలేదంటే అతిశయోక్తి కాదు.

మూకీ నుంచి టాకీకి మారి, ఆధునిక 3డి సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చే పోటీ సినిమాలను సైతం తట్టుకుని అప్పటికీ, ఇప్పటికీ ఎవర్‌ గ్రీన్‌గా దాదాపు మూడు తరాల ఆదరాభిమానాలను సొంతం చేసుకున్న ఘనత టామ్‌ అండ్‌ జెర్రీకే దక్కుతుంది. సరిగ్గా 1940 సంవత్సరంలో ప్రముఖ అంతర్జాతీయ వినోదాత్మక ఎంజీఎం కోసం విలియం హన్నా, జోసెఫ్‌ బార్బారాలు సృష్టించిన ఈ నవ్వుల హంగామా, ఎప్పటికప్పుడు లేటెస్ట్‌ టెక్నాలజీతో బహుళ జనాదరణ పొందుతోంది.

1970-90 మధ్యకాలంలో టీవీలలో వచ్చే కార్టూన్‌ ఎపిసోడ్స్‌ ద్వారా టామ్‌ అండ్‌ జెర్రీ ప్రజలకు చేరువయింది. వీటిని అర్థం చేసుకోవడానికి ప్రత్యేక భాష అవసరం లేదు. కేవలం హావభావాలతోనే దర్శకుడు తాను చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా ఈ పిల్లి ఎలు క పాత్రల ద్వారా చెప్పిస్తుంటాడు. 1992లో దీనిని టామ్‌ అండ్‌ జెర్రీ మూవీగా దీనిని విడుదల చేశారు. 1993, 2000 సంవత్సరం కూడా దీనిని విడుదల చేశారు.

webdunia
PTI
ఆ తరువాత, ప్రఖ్యాత కార్టూన్‌ నెట్‌ వర్క్‌ పిల్లల చానల్‌ కోసం ప్రత్యేకంగా దీనిని టామ్‌ అండ్‌ జెర్రీ ది మాన్షన్‌ క్యాట్‌ సిరీస్‌ కింద ఓ టీవీ లఘుచిత్రాన్ని కూడా విడుదల చేశారు. అలాగే 2005లో లాస్‌ఏంజిల్స్‌ థియేటర్లలో ద కరాటే గార్డ్‌ అనే నూతన టీవీ లఘు చిత్రాన్ని సహదర్శకుడు జోబార్బేరా తీసి విడుదల చేశాడు. ఇప్పుడు పూర్తిగా వార్నర్‌ బ్రదర్స్‌ సంస్థ టామ్‌ అండ్‌ జెర్రీ నిర్మాణ, పంపిణీ బాధ్యతలు చూసుకుంటోంది.

ఇదిలా ఉంటే.. మొదట్లో తయారుచేసిన టామ్‌ అండ్‌ జెర్రీ రూపాలు విచిత్రంగా ఉండేవి. ఒళ్లంతా బొచ్చుతో ముఖం అంతా ముడతలతో టామ్‌ కనిపించేది. కనుబొమ్మలు కూడా ఎక్కువ గీతలు గీసినట్లుగా ఉండి విచిత్రమైన వేషధారణతో చూడగానే జోకర్‌ను చూసినట్లుగా ఉండేది. మొదట్లో నాలుగు కాళ్లతో అచ్చంగా పిల్లి కదలికలు ఉండేలా జాగ్రత్తలు పడ్డారు దర్శకులు. ఆ తర్వాత క్రమేపీ టామ్‌ను పాకకుండా రెండు కాళ్ల మీద నిలబెట్టే ప్రయత్నం చేశారు.

అయితే ప్రతి ఎపిసోడ్‌లోనూ టామ్‌ అండ్‌ జెర్రీ కొట్టుకోవడమే ప్రధానాంశం అయినప్పటికీ వాటిని మలచిన తీరు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. టామ్‌కు ఊరికే ఉడుకుమోతుతనం ఎక్కువ. జెర్రీ అల్లరిది. అయినా తన బుద్ధిబలంచేత టామ్‌ను మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది. టామ్‌ అన్ని రకాలుగా ఓడిపోతుంటుంది.

టామ్‌ అండ్‌ జెర్రీ సినిమాలు, లఘు చిత్రాలు ఏవైనా కానీ భాష లేకుండా కేవలం హావభావాలతోనే రూపొందించడంతో అన్ని దేశాల ప్రజలు ఈ చిత్రాలను విశేషంగా ఆదరించారు. భారతదేశం, ఆసియా, మెక్సికో, అర్జెంటినా, పాకిస్థాన్‌, కొలంబియా, బ్రెజిల్‌, వెనుజులా, రుమేనియాలలో కూడా కార్టూన్‌ నెట్‌‌వర్క్‌ ఇప్పటికీ ప్రతిరోజూ ఈ టామ్‌ అండ్‌ జెర్రీ షోలను ప్రదర్శిస్తుంది. కమ్యూనిస్ట్‌ దేశాలయిన రష్యా, చైనా వంటి దేశాలలో కూడా టామ్‌ అండ్‌ జెర్రీ లఘు చిత్రాలు విశేష ఆదరణ పొందటం విశేషంగా చెప్పవచ్చు. సో.. పిల్లలూ.. టామ్ అండ్ జెర్రీ మరిన్ని సంవత్సరాలు చిన్నా పెద్దా తేడాల్లేకుండా అందరినీ అలరించాలని మనసారా కోరుకుందామా..?!

Share this Story:

Follow Webdunia telugu