Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ్రిటన్‌లో పన్నెండేళ్ల బాలురకు కండోమ్‌లు..!!

బ్రిటన్‌లో పన్నెండేళ్ల బాలురకు కండోమ్‌లు..!!
టీనేజ్ బాలికలు గర్భం ధరించకుండా ఉండేందుకు బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా, 12 సంవత్సరాల మగపిల్లలకు క్రెడిట్ కార్డులపై కండోమ్‌లను పంచిపెట్టనుంది. 12 సంవత్సరాల పిల్లలకు సెక్స్, వారికి కండోమ్స్... అనేవి వినేందుకు మనకు కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. ఎందుకంటే, పాశ్చాత్య దేశాల ప్రజలు ఇలాంటి సంస్కృతికి ఎప్పటినుంచో దాసోహమైపోయారు.

యూరప్‌ దేశాలలో మిగిలిన దేశాల కంటే, బ్రిటన్‌లోనే టీనేజ్ బాలికలు అత్యధిక సంఖ్యలో గర్భం దాలుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక్కడి బాలికలు తమ వయసే ఉన్న బాలురతో శృంగారం నెరపి 14, 15 సంవత్సరాలకే తల్లులవుతున్నారు. దీనికి నిదర్శనంగా కొద్ది నెలల ముందు జరిగిన ఓ విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించడం సబబుగా అనిపిస్తోంది.

అదేంటంటే... లండన్‌కు చెందిన అల్ఫీ పాటెన్ అనే పదమూడు సంవత్సరాల బాలుడు, అతి చిన్న వయసులోనే తండ్రైన బాలుడిగా ప్రపంచవ్యాప్తంగా రికార్డులకెక్కాడు. బ్రిటన్‌లోని ఈస్ట్‌బౌర్న్‌లో ఉంటున్న చాంటెల్లీ స్టెడ్‌మన్ ‌(15) ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ శిశువు (మైసీ)కు జన్మనిచ్చింది. స్టెడ్‌మన్‌ గర్భవతి కావడానికి తానే కారణమని నమ్మిన పాటెన్‌.. మైసీకి తానే తండ్రినని ప్రకటించాడు. అప్పట్లో ఈ అంశం చాలా చర్చనీయాంశమైంది.

దీన్నలా కాసేపు పక్కన పెడితే... ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా, బ్రిటన్‌లోని "బ్రూక్" అనే సెక్స్ సంబంధ సలహాల సంస్థ 12 సంవత్సరాలు దాటిన మగ పిల్లలకు క్రెడిట్ కార్టులపై కండోమ్‌లను పంపిణీ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు "బాలలు, పాఠశాలలు, కుటుంబ సంక్షేమ శాఖ" కోసం ఈ సంస్థ ఓ పథకాన్ని రూపొందించి ఇచ్చింది.

ఈ పథకం కింద బ్రిటన్‌లో ఫుట్‌బాల్ మైదానాలు, క్షౌరశాలలు, స్కౌట్ కేంద్రాలలో కండోమ్‌లు అందుబాటులోకి రానున్నాయి. కొన్ని మున్సిపల్ కౌన్సిళ్లలో కండోమ్‌ల పంపిణీ ఇప్పటికే ప్రారంభమైనందనీ, ఈ ఏడాది చివరికల్లా దేశ వ్యాప్తంగా 12 సంవత్సరాలు దాటిన మగపిల్లలందరికీ కండోమ్‌లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పినట్లుగా "ది మిర్రర్" పత్రిక ఓ వార్తా కథనాన్ని వెల్లడించింది.

చిన్న వయసులోనే సెక్స్‌ సంబంధాలలో మునిగి తేలుతున్న బాల, బాలికలకు కౌన్సిలింగ్ జరిపి... చిన్న వయసులో సెక్స్ మంచిదికాదని తెలియజెప్పాల్సిన బ్రిటన్ ప్రభుత్వం, అది సాధ్యం కాదని అనుకుందో ఏమోగానీ.. "సురక్షిత సెక్స్‌"కు సంబంధించిన కార్యక్రమాలకు పూనుకుంది. ఏది ఏమయినా, ఈ సంస్కృతి పాశ్చాత్య దేశాలకు చెల్లుబాటు అవుతుందేమోగానీ, మనకు మాత్రం వర్తించదు. భారతీయులెవరూ ఇలాంటి వాటిని హర్షించరు కూడా...!!

Share this Story:

Follow Webdunia telugu