Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బుల్లితెరతో చిన్నారులకు హాని...!

బుల్లితెరతో చిన్నారులకు హాని...!
వచ్చీరాని మాటలతో, ముద్దు ముద్దుగా మాట్లాడే బుజ్జాయిలను చూస్తే ఎలాంటి వారికయినా భలే సంతోషం కలుగుతుంది. అయితే చిన్నతనంలో అంటే రెండు సంవత్సరాల లోపు వయసులో ఉన్న చిన్నారులు ఎక్కువగా టీవీ చూసినట్లయితే.. ముద్దు ముద్దు మాటలను త్వరగా మాట్లాడలేరనీ, దేన్నీ సరిగా గుర్తు పెట్టుకోలేరని తాజా అధ్యయనం ఒకటి వెల్లడిస్తోంది.

సాధారణంగా చిన్న పిల్లలు తల్లిదండ్రులు, తమ పరిసరాలలోని పెద్దలు మాట్లాడుకునే మాటలను విని, అవే పదాలు మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ, ఇంట్లో టీవీ పెట్టి ఉన్న సందర్భాలలో పిల్లలు అతి కొద్ది పదాలను మాత్రమే పెద్దల నుంచి సంగ్రహిస్తారనీ.. భవిష్యత్తులో ఇది వారి పరిశీలనా శక్తిని తీవ్రంగా దెబ్బ తీస్తుందని సీటెల్‌లోని వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.

ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన డిమిట్రీ క్రిస్టకిస్ మాట్లాడుతూ... తమ పరిశోధనల్లో భాగంగా దాదాపు 330 మంది రెండు నుంచి నాలుగు సంవత్సరాల లోపు చిన్నారులపై అధ్యయనం జరిపిన అనంతరం, తాము పై నిర్ధారణకు వచ్చినట్లు పేర్కొన్నారు. పరిశోధకులు తేలికపాటి రికార్డ్‌లను తీసుకుని వాటిని చిన్నారులకు అమర్చారనీ, 24 గంటలపాటు నిరంతరాయంగా చిన్నారులు పలికే ప్రతి మాటనూ రికార్డ్ చేశారని క్రిస్టకిస్ చెప్పారు.

ఆ తరువాత ఆ రికార్డులను కంప్యూటర్ ప్రోగ్రాం సాయంతో విశ్లేషించినట్లు క్రిస్టకిస్ తెలిపారు. పిల్లలు టీవీ చూసిన ప్రతి గంట వ్యవధిలో తల్లిదండ్రుల నుంచి వినాల్సిన 770 పదాలను తక్కువగా వింటున్నారనీ, మొత్తం మీద ఇది ఏడుశాతం తక్కువని అన్నారు. అలాగే, చిన్నారులు తరచుగా గుగ్గూ, గగ్గా అంటూ చెప్పే మాటలు కూడా చాలా వరకు తగ్గిపోయాయనని క్రిస్టకిస్ వివరించారు.

తల్లిదండ్రులతో తమ మనసులోని భావాలను బయటకు చెప్పాలని ప్రయత్నించే క్రమంలో చిన్నారులు గుగ్గూ, గగ్గా అనే పదాలను పలుకుతుంటారనీ... అయితే టీవీలో నిమగ్నమైన పెద్దలు అసలు పిల్లల గురించి పట్టించుకోరనీ, ఫలితంగా శిశువులు ఈ పదాలను కూడా పలుకలేకపోతున్నారని క్రిస్టకిస్ చెప్పారు.

శిశువులు మెదడు ఎదుగుతున్న క్రమంలో వారు వినే ప్రతి మాటా వారికెంతగానో అవసరమనీ, అందుకే రెండు సంవత్సరాలు దాటేదాకా పిల్లలను టీవీ చూడనివ్వకూడదని క్రిస్టకిస్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే... గతంలో మసాచుసెట్స్ యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనంలోనూ దాదాపు ఇలాంటి ఫలితాలే రావడం గమనార్హం.

ఈ సందర్భంగా మసాచుసెట్స్ డేనియల్ అండర్సన్ అనే పరిశోధకుడు మాట్లాడుతూ... టీవీ ఎక్కువగా చూసే రెండు సంవత్సరాల లోపు చిన్నారులు మిగిలినవారికంటే, దాదాపు 20 శాతం మాటలను తక్కువగా నేర్చుకుంటారని అన్నారు. అదే రెండేళ్ళు, ఆపై వయసు చిన్నారులు టీవీ నుంచి ఎన్నో కొత్తపదాలను నేర్చుకుంటారని అండర్సన్ తెలియజేశారు.

Share this Story:

Follow Webdunia telugu